బీజేపీకి నూతన అధ్యక్షుడు నియమించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టీడీపీ బద్ద వ్యతిరేకయిన సోము వీర్రాజును అధ్యక్షుడిని చెయ్యడంతో ఇక్కడ తమకు టీడీపీనే టార్గెట్ అని బీజేపీ తేల్చి చెప్పినట్టు అయ్యింది. అయితే ఈ తరుణంలో బీజేపీ కూడా గతంలో టీడీపీ చేసిన తప్పే చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది.
“2019 ఎన్నికలలో చంద్రబాబు జగన్ కంటే ఎక్కువగా మోడీని టార్గెట్ చేశారు. ఎన్నికలలో బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అన్నట్టు వ్యవహరించారు. దానితో భారీగా నష్టపోయారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ని కాకుండా చంద్రబాబుని టార్గెట్ చేస్తే అదే తప్పు చేస్తున్నట్టే,” అంటూ విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్ లో పుట్టిన కన్నా లక్ష్మీనారాయణ ఎప్పుడూ చంద్రబాబు వ్యతిరేకే. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అలాగే పోరాడారు. ఆ తరువాత ప్రభుత్వం మారాకా కన్నా అదే విధంగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కన్నా జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అది టీడీపీకి కలిసి వస్తుందేమో అని ఆయన్ను తప్పించారు.
“జగన్ ని తిడితే చంద్రబాబుకు కలిసివస్తుందేమో అనే ఆలోచనే బీజేపీని భవిష్యత్తులో ఇబ్బంది పెడుతుంది. ప్రతిపక్ష పార్టీలు తమలో తాము కొట్టుకుంటే అది అధికార పార్టీకే కలిసి వస్తుంది. అది ఎంత త్వరగా బీజేపీ తెలుసుకుంటే అంత మంచిది,” అని విశ్లేషకులు అంటున్నారు.





