గత ఏడాది కాలంగా మెగా హీరోలు ఓ కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టుగా కనపడుతోంది. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ నుండి మొదలుకుని రామ్ చరణ్ ‘ధృవ,’ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150,’ తాజాగా సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ సినిమాల వరకు ఏ సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదు. ఆడియో వేడుకల స్థానంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్లు నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో భారీ హైప్ సృష్టిస్తున్నారు. మిగతా మెగా హీరోల సినిమాలను అభిమానులు పెద్దగా పట్టించుకున్నా, లేకున్నా, పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ కూడా ఇదే ట్రెండ్ ను అనుసరించడంతో, మెగా అభిమానులకు కొత్త డౌట్ వస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్ నిర్వహించకుండా, ఒక్కసారే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తారా? అనేది ఓ పెద్ద డౌట్ గా మారింది. ‘గోపాల గోపాల’ ఫేం అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ‘కాటమరాయుడు’ పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసిన తర్వాత గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలనే యోచనలో చిత్ర యూనిట్ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ, తన ఫ్యామిలీ హీరోల బాటలోనే ‘ట్రెండ్ సెట్టర్’గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కూడా పయనిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.



