పెద్ద నోట్ల రద్దు పుణ్యమాని ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఫోన్‌పే, గూగుల్ పే, పేటియం యాప్‌ల ద్వారానే కొత్తిమీర కట్ట మొదలు విమానంలో టికెట్ల వరకు అన్నిటినీ కొనుక్కోగలుగుతున్నాము. చివరికి కొన్ని చోట్ల బిచ్చగాళ్ళు కూడా ‘క్యూఆర్ కోడ్’ తీసుకొని మొబైల్ యప్స్ ద్వారా ప్రజల నుంచి డబ్బులు స్వీకరిస్తున్నారు.
మొదట్లో ఏపీలో మద్యం దుకాణాలలో కూడా ఫోన్‌పే, గూగుల్ పే, పేటియం యాప్‌ల ద్వారా డబ్బు తీసుకొనేవారు. కానీ హటాత్తుగా వాటిని నిలిపివేసి నగదు మాత్రమే తీసుకొంటున్నారు. ఏమంటే వాటితో లెక్కలు ఇబ్బంది అవుతున్నాయని చెపుతున్నారు.
అయితే పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ లోనే వాటితో చెల్లింపులు జరుగుతున్నప్పుడు ఏపీలో మద్యం దుకాణాలలో లెక్కలకు ఎందుకు ఇబ్బంది?అంటే దానికి టిడిపి సోషల్ మీడియాలో జవాబు చెప్తోంది.
నగదు రూపంలో జమా అవుతున్న ఈ సొమ్మంతా తాడేపల్లి లాకర్లలోకి చేరుకొంటోందని వాదిస్తోంది. అయితే మద్యం అమ్మగా వచ్చిన సొమ్మును తాడేపల్లి లాకరులో పెట్టుకొంటే, మద్యం కంపెనీలు నష్టపోతాయి కదా?అంటే దానికీ టిడిపి చెప్పిన సమాధానం విని ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించడంతో, ఇంతకాలం బాడాబాబుల లాకర్లలో బందీ అయిపోయిన మహాలక్ష్మీకి విముక్తి లభిస్తోంది. అయితే దానిని తీసుకువెళ్ళి బ్యాంకులలో జమా చేస్తే, ఐటి, ఈడీలు మీద పడే ప్రమాదం ఉంటుంది.
కనుక తాడేపల్లి లాకర్లలో పేరుకుపోయిన రెండువేల నోట్లన్నీ మద్యం అమ్మకాల ద్వారా వచ్చే సొమ్ముతో మార్పిడి చేసుకొంటుండవచ్చని టిడిపి చెపుతోంది. తద్వారా తాడేపల్లిలో పేరుకుపోయిన రెండువేల నోట్లు మద్యం దుకాణాల ద్వారా బ్యాంకులకు రాజమార్గంలో వెళ్లిపోతాయి. మద్యం దుకాణాలలో వచ్చిన నోట్లు తాడేపల్లికి చేరుకొంటాయని టిడిపి వాదిస్తోంది.
వాదించడమే కాదు… మొబైల్ యాప్‌తో రూ.10లు చెల్లించి మిర్చీ బజ్జీ కొని చూపించి, తర్వాత మద్యం దుకాణానికి వెళ్ళి మద్యానికి మొబైల్ యాప్ ద్వారా పేమెంట్స్ తీసుకోవడంలేదని కేవలం నగదు మాత్రమే తీసుకొంటున్నారని నిరూపించి చూపింది. ఈ నోట్ల మార్పిడి నిజమో కాదో తెలీదు కానీ ఏపీలో మద్యం దుకాణాలలో మొబైల్ యాప్ చెల్లవని మాత్రం స్పష్టం అవుతోంది.
రాష్ట్రంలో టీ స్టాల్ దగ్గర నుంచి, రైతు బజార్ వరకు అన్నిచోట్ల డిజిటల్ పేమెంట్ ఉంది. కానీ జగన్ నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ చేసే అవకాశం లేదు, అంతా క్యాష్ రూపంలోనే తీసుకుంటున్నారు. ఏంటి ఈ రహస్యం..? ఈ క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుంది..? వీటికి లెక్కా పత్రాలు ఏమైనా ఉన్నాయా..?? pic.twitter.com/iMhlKToVIt
— Telugu Desam Party (@JaiTDP) June 16, 2023



