
జగన్ అధికారంలో ఉన్నన్నాళ్ళు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటూ కూనిరాగం తీశారు. కొన్ని మంత్రి, ఎమ్మెల్యే పదవులు ఆ వర్గాలకు ఇచ్చినా వారిని ప్రజలకు చూపించి మంచి పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నించారు తప్ప ఏనాడూ వారికి ప్రభుత్వంలో కానీ, పార్టీలోగానీ సముచిత గౌరవం ఇవ్వలేదు.
Also Read – వైసీపీ బుట్టలో ఎల్ఐసీ… గిలగిలా కొట్టుకుంటోంది పాపం!
ఇక జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడులకు అంతే లేదు. ప్రభుత్వంలో దళిత మంత్రి వైసీపి ఎమ్మెల్సీ అనంత బాబు కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేయడం దానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
బడుగు బలహీన వర్గాలపై జగన్ ప్రేమ వారి ఓట్ల కోసమే తప్ప వారి పట్ల అభిమానంతో కాదని సంక్షేమ పధకాలతో మరోసారి నిరూపించుకున్నారు. అందుకే వారు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఓడించారు. ఈ విషయం అందరి కంటే జగన్‌కే బాగా తెలుసు.
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
కానీ జగన్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వారిని తన రాజకీయాలలో పావులుగా వాడుకోవాలనుకోవడం చాలా దారుణం.
టిడిపి కూటమి ప్రభుత్వం విజయవాడలో తాను ఏర్పాటు అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చేసేందుకు కుట్రలు చేస్తోందంటూ వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు వైసీపి ప్రయత్నిస్తోంది.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో మొన్నరాత్రి కరెంట్ పోయి లైట్లు ఆరిపోతే, చంద్రబాబు నాయుడే విద్యుత్ సరఫరా నిలిపివేయించారని, ఆ చీకటిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వైసీపి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగాం సురేశ్, వైసీపి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “విజయవాడలో జగన్ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కనుక మనం అందరం కలిసి ఆ విగ్రహాన్ని కాపాడుకోవలసి ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తున్నాము.
శిలాఫలకంపై జగన్ పేరు కనిపించకుండా ధ్వంసం చేయడాన్ని మేము ఖండిస్తున్నాము. తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం,” అని హెచ్చరించారు.
నిన్న మొన్నవరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ చేసిన దుష్ప్రచారానికి ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో, ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహం పేరుతో దుష్ప్రచారం చేస్తూ బడుగు బలహీన వర్గాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది.
అసలు ఇలాంటి విధ్వంసం ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తాయి తప్ప సిఎం చంద్రబాబు నాయుడుకి కాదు. కనుక ఒకవేళ అటువంటి కుట్ర ఏమైనా జరిగుతున్నట్లయితే ముందుగా ఆయననే అనుమానించాల్సి ఉంటుంది.
జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలకు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మద్దతు కూడా లభించనప్పటికీ ఆమె పల్నాడు జిల్లాలో విత్తనాల కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై టిడిపి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అదేవిదంగా జగన్ కూడా ధైర్యంగా ప్రజల మద్యకు వచ్చి ఇటువంటి ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడవచ్చు కదా?
బడుగు బలహీన వర్గాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ నీచరాజకీయాలతో జగన్ ఏమైనా సాధించగలరా?ఆలోచిస్తే మంచిది.