ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కుల ప్రస్తవన ఎక్కువ అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ 2.0 కోసం వైసీపీ ఏపీ లో కుల రాజకీయాలు 2.0 ని సృష్టిస్తుంది. అందు కోసం వైసీపీ ఈసారి కాపు కులాల్ని టార్గెట్ గా ఎంచుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇక ఆ రాజకీయానికి నాగరాజు మిస్సింగ్ కేసును ఒక ఆయుధంగా వినియోగించుకుంటుంది.
అందుకోసం కాపులు తెలివితక్కువవారు, ఆవేశపరులు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు, ఎక్కువగా మాంసం తింటారు, మందు బాగా తాగుతారు, అంటూ కాపు సామాజికవర్గం మీద అవాకులు చవాకులు పేలిన అంబటి రాంబాబు ను తెరమీదకు తెచ్చి ఆయనను కాపు సంక్షేమ సేన అధ్యక్షడిగా చిత్రీకరిస్తున్నారు.
ఇక జగన్ దగ్గర మేమంతా పెద్ద పాలేరులం అంటూ తన రాజకీయ ప్రయోజనాల కోసం తన సామాజికవర్గాన్ని అత్యంత హీనంగా కించపరిచిన పేర్ని నాని ని కాపు సామాజికవర్గానికి కాపు కాసే సేవకుడిగా ప్రచారం చేస్తున్నారు. ఇక వైసీపీ అల్లిన ఈ కుల వలయంలోకి ఇప్పుడు ఒక్కో వైసీపీ కాపు నాయకుడు వచ్చి చేరుకుంటున్నాడు, అలాగే అదే సామాజికవర్గ నేత ఓటమిని కోరుకుంటున్నాడు.
నిన్న మొన్నటి వరకు వైసీపీ ఆడే కాపు కుల రాజకీయ చదరంగం కోసం ముద్రగడను ప్రయోగించిన జగన్ ఇప్పుడు రూట్ మార్చి అంబటి. పేర్ని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, వంగా గీత….ఇలా వైసీపీ లో ఉన్న కాపు నేతలందరినీ మీడియా ముందుకు తెచ్చారు.
వీరందరిని ఒక కవచం లా మార్చుకుని జగన్ ఏపీలో ఎన్నికల కురుక్షేత్రంలో కుల రాజకీయ యుద్ధం చేస్తున్నారు. జగన్ 2.0 కోసం రాష్ట్రాన్ని కులాలుగా విభజించి వారి మధ్య కుల చిచ్చులు పెట్టి కులం అనే మంటలలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ని కాల్చి బూడిద చెయ్యాలని చూస్తున్నారా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సాయికృష్ణ కనిపించకుండా పోతే అందుకు సాయికృష్ణ ఎక్కడ అని పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తేనో, ప్రభుత్వాన్ని నిలదీస్తేనో సరిపోతుంది, కానీ వైసీపీ ఒక కాపు వ్యక్తి మిస్సింగ్, కూటమి ప్రభుత్వంలో కాపులకు రక్షణ లేదు, ఒక కాపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కాపు వారి నేరాలకు కాపు కాయావా.? అంటూ దాన్ని కులానికి అంటకడుతుంది.
నాడు వివేకా హత్య జరిగితే పలానా వ్యక్తి దారుణ హత్య అని అందరు ముక్త కంఠంతో ఖండించారే తప్ప రెడ్డి నాయకుడు చంపబడ్డాడు, రెడ్డి నేత పై దాడి అంటూ వివేకా హత్య పై ఎవరు కుల ప్రస్తవన తేలేదు. దాన్ని అడ్డుపెట్టుని రాష్ట్రంలో కుల రాజకీయాలు నడపలేదు.
కానీ వైసీపీ మాత్రం ప్రతి అంశం లో కులం ను జోడిస్తూ దాన్ని కుల వివాదంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. కుల బలహీనతలే వైసీపీ రాజకీయ బలంగా మారుతున్నాయా.? జగన్ మారుస్తున్నారా.? కాపు ల రక్షణ పేరుతో జగన్ చేస్తున్న ఈ కాపు కుల రాజకీయంలో చివరికి బలయ్యేది కూడా వైసీపీ కాపు నేతలే కావడం ఇక్కడ కొసమెరుపు.
కాపు లకు రిజర్వేషన్లు ఇవ్వలేను అంటూ బహిరంగంగా ప్రకటించిన జగన్ కాపు సామాజికవర్గాన్ని కాపు కాస్తానంటే ఆ సామాజికవర్గం నమ్ముతుందా.? జగన్ వెంట నడుస్తుందా.? గెలుపులో రెడ్డి సామాజికవర్గానికి రాజకీయ పెత్తనం ఇచ్చి ఓటమిలో కాపు నేతలను కాపు కాయమంటున్న జగన్ కాపు సామాజికవర్గానికి అండగా ఉంటారా.?
పవన్ కళ్యాణ్ అనే ఒక్క కాపు నాయకుడిని రాజకీయంగా పతనం చెయ్యడానికి మొత్తం వైసీపీ కాపు నేతలందరినీ రాజకీయ నిరుద్యోగాలుగా మార్చిన జగన్ వెంట కాపు సామాజికవర్గం కలిసి అడుగేస్తుందా.? ఇటువంటి వైసీపీ కుల రాజకీయ వలయాలను చీల్చుకునే శక్తి కాపు సామాజికవర్గం సొంతమని 2024 ఎన్నికలలో ఆ సామాజికవర్గం నిరూపించింది. అయినా వైసీపీ ఇప్పటికి అదే పంథాలో కొత్త వివాదాలను సృష్టిస్తుంది. మరి దీని తాలూకా మూల్యం చెల్లించేదెవరు.?




