రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించబోతున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా వెనుక వైసీపీ హస్తం ఉందన్న విషయం బహిరంగమే. తాజాగా దానిని బలపరిచే విధంగా వైసీపీకి చెందిన మీడియాలోనే ఈ చిత్ర విశేషాలను చెప్పుకు రావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. అయితే ఎప్పటిమాదిరే సినిమా పబ్లిసిటీ ఎలా చేయాలో తెలిసిన వర్మ, ఈ సారి కూడా అదే పంథాను అనుసరిస్తూ జగన్ మీడియా ఛానల్ లో “లక్ష్మీస్ ఎన్టీఆర్” గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు.
ఈ “లక్ష్మీస్ ఎన్టీఆర్” కొందరికి గుడ్ గా ఉంటుందని, మరికొందరికి బ్యాడ్ గా ఉంటుందని చెప్పిన వర్మ, టైటిల్ రోల్ అయిన లక్ష్మీ పార్వతి పాత్ర మాత్రం గ్లామరస్ గా ఉండబోదని స్పష్టం చేసారు. అయితే ఎన్టీఆర్ ను ఆకర్షించడానికి లక్ష్మీ పార్వతిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో చూపిస్తానని, ఈ సినిమాలలో మహిళలను గ్లామరస్ గా చూపించనని అన్నారు. ఎన్టీఆర్ చరిత్రపై తాను అధ్యయనం చేసానని, ఈ పాత్రలో ఓ కొత్త నటుడ్ని ఎంపిక చేసానని, ఇప్పటికే ఆయనకు శిక్షణ ఇస్తున్నామని స్పష్టం చేసారు.
ఇక ఎన్టీఆర్ ను తప్పుగా చూపిస్తే ఊరుకోబోమని వస్తున్న తీవ్ర వ్యాఖ్యల గురించి స్పందిస్తూ…. ఎన్టీఆర్ గురించి తప్పుగా తీస్తానని ఎవరి చెవులో అయినా నేను చెప్పానా? తాను ఎటువంటి కధతో తీస్తున్నానో ఎవరికైనా తెలుసా? మహానుభావుడైన ఎన్టీఆర్ గురించి ఎన్ని సినిమాలైనా తీయవచ్చని, హిట్లర్ పై 37 సినిమాలు తీసారని, వేర్వేరు ఘటనల ఆధారంగా ఎన్ని సినిమాలైనా తీసుకోవచ్చని తనదైన శైలిలో వాదించారు వర్మ. అయితే ‘వంగవీటి’ టైటిల్ పెట్టి ‘దేవినేని’ వర్గానికి అనుకూలంగా సినిమా తీసిన వర్మను నమ్మే స్థితిలో ఎవరు లేరన్నది అయితే స్పష్టం.


