నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు నివాళులు అర్పించారు. ఈరోజు సాయంత్రం గుడివాడ పట్టణంలో టిడిపి అధ్వర్యంలో ‘రా.. కదిలి రా…’ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా పార్టీలో ముఖ్యనేతలందరూ హాజరుకాబోతున్నారు. కనుక రెండు రోజులుగా ఈ సభకు ఏర్పాట్లు జరుగుతుండటంతో పట్టణంలో టిడిపి శ్రేణులు హడావుడి మొదలైంది.
ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడ టిడిపి ఇన్‌చార్జి వెనిగండ్ల రాము, సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు అధ్వర్యంలో టిడిపి, జనసేనలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు బైక్ ర్యాలీతో బయలుదేరారు.
అయితే వారి కంటే ముందే గుడివాడ వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులతో కలిసి అక్కడకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఆయన కోసం పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి టిడిపి, జనసేన శ్రేణులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వారి మద్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి.
టిడిపి, జనసేన కార్యకర్తలు బ్యారికేడ్లను తోసుకుని ముందుకు సాగి, ఎన్టీఆర్ స్టేడియం చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని, అనుచరులు హడావుడిగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అనంతరం వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వెనిగండ్ల రాము ఇరు పార్టీల కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ నాలుగేళ్ళలో కొడాలి నాని గుడివాడని అభివృద్ధి చేయకుండా, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కాలక్షేపం చేసి, ఇప్పుడు యూట్యూబ్ వ్యూస్ కోసం హడావుడి చేస్తున్నారు.
అసలు ఆయనకు జగన్ మళ్ళీ టికెట్ ఇస్తారో పక్కన పెట్టేస్తారో తెలీదు. ఒకవేళ టికెట్ ఇచ్చినా శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడం ఖాయం. ఈ భయంతోనే ఇప్పుడు ఎన్టీఆర్‌కు నివాళులు పేరుతో నాటాకాలు ఆడుతున్నారు.
అయితే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను బూతులు తిట్టిన కొడాలి నానికి ఎన్టీఆర్ పేరు తలుచుకునే అర్హత కూడా లేదు. అలాంటి వ్యక్తి కోసం మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం సరికాదు. కొడాలి నాని తన అధినేతని ప్రసన్నం చేసుకునేందుకు, ఈరోజు గుడివాడలో జరుగబోయే మా పార్టీ సభకు అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మేము సభ నిర్వహించి తీరుతాము,” అని అన్నారు.
టిడిపి హిట్ లిస్టులో ఉన్నవారిలో కొడాలి నాని కూడా ఒకరు. రాబోయే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో కొడాలి నానిని ఓడించి తీరాలని టిడిపి నేతలు చాలా పట్టుదలగా ఉన్నారు. ఈవిషయం ఆయనకు కూడా తెలుసు. అందుకే ఎన్టీఆర్ వర్ధంతి పేరుతో హడావుడి చేస్తూ, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్‌ల మద్య మరోసారి చిచ్చు రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా జూ.ఎన్టీఆర్ వైసీపివైపు ఉన్నారని గుడివాడ ప్రజలను నమ్మించేందుకు కొడాలి నాని ప్రయత్నిస్తున్నారు. కానీ టిడిపి నేతలు కొడాలి నాని ప్రయత్నాలను ఈవిదంగా సమర్ధంగా తిప్పికొడుతున్నారు.




