ఏపీ : లిక్కర్ లో ఓ 10 వేల కోట్లు!

ఏపీ : లిక్కర్ లో ఓ 10 వేల కోట్లు!ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనాలకు నిలయంగా నిలుస్తోంది. తనను జైలులో చంపేందుకు పధకం రచించారని, కోర్టు ఆదేశాల ప్రకారం రెండు హాస్పిటల్స్ లో చికిత్స అందించి నివేదిక ఇవ్వాలని ఆదేశించగా, తనకు కేవలం ఒక హాస్పిటల్ లో చూపించి జిల్లా కారాగారానికి తరలించారని అన్నారు.

తాను జైలుకు వెళ్లిన రోజు పలు సందర్భాలలో కరెంటు పోయిందని, అలా ఎప్పుడూ జరగదని, ఒకవేళ విద్యుత్ లేని పక్షంలో జనరేటర్ ఉంటుందని, కానీ ఆ రోజు అది కూడా పనిచేయలేదని, ఆ రాత్రి తనకు అనుమానం వచ్చి తన పడకను సెల్ కు దూరంగా జరుపుకున్నానని, మరుసటి రోజు ఓ ఖైదీ తనకు వేడి నీరును అందించారని తెలిపారు.

ADVERTISEMENT

ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఓ నెంబర్ నుండి అదే పనిగా కాల్ వస్తే ఎట్టకేలకు లిఫ్ట్ చేసానని, అతను తనకు జైలులో వేడి నీరును అందించిన వ్యక్తి అని చెప్పుకున్నాడని, తాను బెంగళూరులో జగన్ ఇంటిలో పని చేస్తానని చెప్పడంతో తాను ఒక్కసారిగా షాక్ కు గురయ్యానని, తనని ఏమి అడగవద్దని చెప్పిన అతను మీకు మాత్రం థ్రెట్ ఉంది, జాగ్రత్తగా ఉండమని సూచించాడని చెప్పారు.

కాల్ చేసిన వ్యక్తి చెక్ బౌన్స్ కేసులో గుంటూరులో అరెస్ట్ అయ్యాడని, కానీ అతనేమో బెంగుళూర్ వాసిగా చెప్పాడని, ఇదంతా ఆలోచించిన తర్వాత తనపై ఆ రోజు రాత్రి హత్యాయత్నం జరిగిందన్న విషయం అర్థమైందని చెప్పుకొచ్చారు. గతంలో కొన్ని కీలక కేసులలో ఇలాగే సెల్ లోనే అంతం అయిన విషయం తనకు తెలుసు కాబట్టి సెల్ కు దూరంగా జరిగానని అన్నారు.

ఆర్ఆర్ఆర్ హత్యాయత్న ఉదంతం ఇలా ఉండగా, 1000 కోట్లు టర్నోవర్ ఉన్న సినీ ఇండస్ట్రీని ఇంత ప్రశ్నిస్తుంటే, లిక్కర్ లో 40000 కోట్లు నగదు లావాదేవీలు చేసేసుకుంటున్నారని, ఇదే విషయాన్ని తాను ఇటీవల పార్లమెంట్ లో కూడా ప్రస్తావించానని తెలిపారు. లిక్కర్ లో 70 శాతం మాత్రమే డ్యూటీ పైన చెల్లించిన సరుకు వస్తోందని, మిగిలిన 30 శాతం బిల్లులు లేకుండా నేరుగా వచ్చేస్తున్నాయని అన్నారు.

ఇక్కడ ఏటీఎం కార్డులు గానీ, గూగుల్ పేలు గానీ పనిచేయవు, కేవలం నగదు చెల్లించాల్సిందేనని, ప్రభుత్వానికి రాయాల్సిన లెక్క ప్రభుత్వానికి రాస్తారని, మిగిలిన 30 శాతంలో తయారీ సరుకు 10 రూపాయలు ఖర్చు కాగా, అమ్ముతున్న ధర మొత్తం 220 అని, ఈ 30 శాతం పూర్తిగా మిగిలిపోతోందని, 70 శాతంలో మాత్రం మార్జిన్ మిగులుతోందని వివరించారు.

స్టాఫ్ ను అందించే రెడ్డి అండ్ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ వాళ్ళే ‘ఏ సరుకు మాకు తెలియదు సార్, అమ్ముతాం క్యాష్ ఇస్తాం, అంతే’ తనకు చెప్పారని అన్నారు. వాళ్ళు ప్రభుత్వానికి ఎంత జమ వేస్తారు, ఎక్కడ జమ వేస్తారనేది తెలియదని, ఒక 10 వేల కోట్లు అదనపు ఆదాయం ఒక సంవత్సరానికి గానూ అంటూ నర్మగర్భంగా ఆర్ఆర్ఆర్ తన భావాలను వ్యక్తపరిచారు. అలాగే ఆక్వాలో కూడా ప్రభుత్వం దూరిపోయిందని, ఏ రంగాన్ని తమ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదంటూ ఏకరువు పెట్టారు.

ADVERTISEMENT
Latest Stories