తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో అభిమానులు ఆయన ఘనస్వాగతం పలికారు. ఆయన పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండడం గమనార్హం. ఆయన దాదాపుగా రెండు గంటల పాటు గడపబోతున్న శారదాపీఠం వద్ద 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఎయిర్ పోర్టు నుండి ఆయన నేరుగా చిన్నముషిడివాడలో ఉన్న శారదాపీఠానికి చేరుకున్నారు.
[m9ad]
అక్కడ రాజశ్యామల ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన భువనేశ్వర్‌కు పయనం కానున్నారు. ఇటీవలే ముగిసిన తెలంగాణ ఎన్నికలకు కొద్ది ముందు పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి కేసీఆర్ తో ఆయన ఫార్మ్ హౌస్ లో రాజశ్యామల యజ్ఞం చేయించారు. ఎన్నికలలో ఘనవిజయం సాధించినందుకు మొక్కు తీర్చుకోవడానికి కేసీఆర్ వస్తున్నారు.
అక్కడ సాయంత్రం 6 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ భేటీ అవుతారు. ఒడిశా పర్యటన అనంతరం రేపు ఆయన కోల్‌కతా వెళ్లి పశ్చిమ్‌బంగ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. విశాఖపట్నం రావడం కేసీఆర్ ఇదే మొదటి సారి. రాష్ట్రవిభజన తరువాత ఆయన ఇప్పటికే తిరుపతి, విజయవాడలకు వెళ్లారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు ఆధ్యాత్మిక టూర్ల మీదే వచ్చారు. ఒకసారి అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. తొందర్లో ఏపీకి రాజకీయ టూర్ కు రాబోతున్నారు ఆయన.



