గత రెండు రోజుల క్రితం అసెంబ్లీ లో ఉప ముఖ్యంమత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మధ్య జరిగిన ఒక చర్చ వివాదంగా మారింది. కాలుష్య మండలి చైర్మన్ కృష్ణయ్య తన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని,
ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే లను పట్టించుకోరని, చైర్మన్ హోదా లో ఉంటూ చాల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, డిప్యూటీ సీఎం నుంచి ఆదేశాలు రావల్సిందే అంటూ నియమాలు పెడతారని, పవన్ కూడా అందుబాటులో ఉండరంటూ బోండా ఉమా అసెంబ్లీ సాక్షిగా ఆ సమస్యకు సరైన పరిష్కారం చూపాలంటూ పవన్ ను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించారు.
అయితే ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ – జనసేన లమధ్య చీలిక సృష్టించాలని, సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య చిచ్చు రేపాలని వైసీపీ భావించినప్పటికీ ఆ ఉచ్చులోకి జనసేన నేతలు కానీ క్యాడర్ కానీ వెళ్ళకపోవడం ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు.
అయితే ఇదంతా కూడా పవన్ నడుపుతున్న మెచ్యూరిటీ రాజకీయాలతో సాధ్యమయ్యిందనే చెప్పాలి. బోండా ఉమా సమస్యను బహిరంగంగా లేవనెత్తినప్పటికీ పవన్ మాత్రం అంతర్గతంగా చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పవన్ తన ఛాంబర్ లో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పంచాయితీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ్ తో సమావేశమై అసెంబ్లీలో ఉమా లేవనెత్తిన సమస్యల పై చర్చించారు. ఇటువంటి అంశాలను చాల సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందచేశారు.
అలాగే అసలు సమస్యకు కారకుడైన మండలి చైర్మన్ కృష్ణయ్యను సైతం ఒకటి రెండు రోజులలో విచారణకు పిలిపించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒక వేళ పవన్ ఇలా కాకుండా సభలోనే ఉమా లేవనెత్తిన సమస్యను మరోరకంగా తీసుకుని సభలోనే ఉమా కు అదే స్థాయిలో సమాధానం చెప్పి ఉంటే అది టీడీపీ – జనసేనల బంధానికి అవరోధంగా మారేది.
దీనితో పవన్ చెపుతున్నట్టుగా ఈ కూటమి బంధం మరో పదిహేనేళ్ళు ఇలానే కొనసాగుతుంది అనే ప్రకటన కు పవన్ కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇరు పార్టీల మధ్య ఏర్పడే చిన్న చిన్న సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అంటూ పార్టీ లీడర్లకు, క్యాడర్ కు పవన్ ఇచ్చే ఆదేశాలను పవన్ కూడా ఖచ్చితంగా పాటిస్తున్నారనేది స్పష్టమయింది.




