‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, విధానాలు రాజకీయ, సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ వాతావరణం నేపధ్యంలో పవన్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్ పాలన విధానంపై పవన్ ప్రశంసలు కురిపిస్తూ ఉండడంతో ఒకప్పుడు తను చేసిన వ్యాఖ్యలను సవరించుకున్నట్లుగా కనపడుతోంది.
“తెలంగాణా ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిస్తున్న సమయంలో రెండు ప్రాంతాల మధ్య విద్వేషకరమైన వ్యాఖ్యలకు కేసీఆర్ నిలయంగా నిలుస్తున్నారన్న” అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. దాదాపుగా ఇవే మాటలను పవన్ కూడా వ్యక్తపరిచారు. ‘సానుకూల వాతావరణంలో విభజన జరగాలి గానీ, ప్రజలకు రెచ్చగొట్టిన పద్ధతి బాగోలేదంటూ’ పవన్ వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా పవన్ వ్యాఖ్యానించడం విశేషం.
“విభజన సానుకూల వాతావరణంలోనే జరిగిందని, అందుకే విభజన తర్వాత ఎలాంటి ఆందోళనలు జరగలేదని, ఉద్యమాన్ని కేసీఆర్ నడిపిన తీరు ఆదర్శప్రాయమని, అలాగే ప్రస్తుతం వ్యవసాయం కేంద్రంగా సాగిస్తున్న పాలన కూడా బాగుందంటూ” కితాబిచ్చారు. పవన్ వ్యాఖ్యలను పరిశీలిస్తుంటే… కేసీఆర్ పై అంతకు ముందు ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు అర్ధమవుతోంది. కానీ, ఇదే జగన్ విషయానికి వస్తే… కాస్తో కూస్తో ఉన్న సదాభిప్రాయం కూడా గాడి తప్పినట్లు కనపడుతోంది.
‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ అన్ని ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు… ఒక్క జగన్ కు చెందిన ‘సాక్షి’కి తప్ప! పవన్ వారిని అనుమతించలేదా… లేక జగన్ ఛానల్ పవన్ ను సంప్రదించలేదా… ఒకవేళ సంప్రదించినా… పవన్ ఒప్పుకోలేదా… ఇలా కారణం ఏదైనా గానీ… సాక్షి ఛానల్ లో పవన్ ప్రత్యక్షం అవ్వలేదన్నది స్పష్టమైన అంశం. ‘వి6, టిన్యూస్’ వంటి సాధారణ ఛానల్స్ లో పవన్ దర్శనమిచ్చారు గానీ, ‘సాక్షి’లో ఇంటర్వ్యూ లేకపోవడానికి జగన్ పై సదాభిప్రాయం లేకపోవడం వల్లనే అనే చర్చ నడుస్తోంది.
అదీ గాక, ఇటీవల చేసిన పలు ప్రకటనల ద్వారా… ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తన విధులు సరిగా నిర్వర్తించ లేకపోవడం వలనే, ప్రజల తరపున పోరాడడానికి ప్రత్యామ్నాయంగా తానూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పవన్ ప్రకటన చేసారన్న విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలలోనూ మరియు విశాఖలోనూ ‘రౌడీ మాఫియా’ను తరిమికొట్టలంటూ లేదంటే ఈ సముద్రాన్ని కూడా మింగేస్తారంటూ జగన్ ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు బహుశా అందరికీ గుర్తుండే ఉంటాయి. రెండు సంవత్సరాల తర్వాత కూడా జగన్ పై అదే అభిప్రాయంతో పవన్ ఉండడం… రాజకీయంగా జగన్ ఏం సాధించారో… అలాగే రాజకీయాలను పవన్ ఎలా అర్ధం చేసుకున్నారో అన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది.
సమకాలీన రాజకీయాలను దూరం నుండి చూస్తుంటేనే పవన్ ఈ మాత్రం అవగాహనకు రాగలిగితే, నిజంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రజల తరపున నిలబడడానికి ఒక వేదిక అవుతారా… అన్న నమ్మకాన్ని కలిగించడంలో సఫలీకృతం అవుతున్నారు. నిజానికి కేసీఆర్, జగన్ ల పై పవన్ వ్యక్తపరిచిన భావనలు ఎక్కువ శాతం ప్రజల్లో కలుగుతున్న అభిప్రాయమే. ఆ ప్రభావమే కేసీఆర్ చెంత చేరే ఎమ్మెల్యేల సంఖ్య పెంపు… జగన్ చెంత ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింపు..!



