విక్రమ్-1 విజయం.. ఎందుకు ప్రత్యేకం?

Vikram-1 rocket launch

భారత అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం ఇది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్‌టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తయారు చేసిన విక్రమ్-1 రాకెట్‌ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది.

దేశంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ ఈ రాకెట్ తయారు చేయడం, దానిని ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం రెండూ అపురూపమైన ఘట్టాలే.

ADVERTISEMENT

ఓ భారతీయ ప్రైవేట్ సంస్థ తొలిసారిగా పూర్తిస్థాయి ఆర్బిటల్ రాకెట్‌ను రూపొందించి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయమనే చెప్పవచ్చు.

‘మిషన్ ఆగమన్’ పేరుతో విక్రమ్-1 రాకెట్ భూమికి సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులో పలు పేలోడ్లను విజయవంతంగా ప్రవేశపెట్టింది.

విక్రమ్-1లో మరో విశేషమేమిటంటే ఇది మూడు దశలలో ఘన ఇంధనంతో, చివరి దశలో ద్రవ ఇంజిన్‌తో పనిచేస్తుంది. మళ్ళీ ఇక్కడా మరో ప్రత్యేకత ఉంది. చివరి దశ మాడ్యూల్‌ ‘3డీ ప్రింట్‌’ చేశారు. ఈ 3డీ ప్రింటెడ్ మాడ్యూల్ స్వయంగా ‘ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్స్’ చేసుకోగలగడం మరో ప్రత్యేకత.

ఈ చివరి దశ మాడ్యూల్ కూడా అనుకున్న విధంగానే అద్భుతంగా పనిచేయడంతో ఈ విజయం మరింత గొప్పగా మారింది.

తక్కువ ఖర్చుతో, వేగంగా చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చేలా ఈ విక్రమ్-1 రాకెట్‌ను రూపొందించారు. ఇది విజయవంతం అవడంతో భవిష్యత్‌లో ‘స్మాల్ శాటిలైట్ లాంచింగ్ మార్కెట్‌’లోకి మరిన్ని భారతీయ కంపెనీలకు ఇది అవకాశాలను సృష్టిస్తుంది.

తెలంగాణ (హైదరాబాద్‌) గడ్డపై తయారైన ఈ రాకెట్ ఆంధ్ర గడ్డ (శ్రీహరికోట)మీద నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోవడంతో ఈ విజయంలో రెండు రాష్ట్రాలు భాగస్వాములుగా మారాయి.

ఇస్రో సాంకేతిక అనుభవం, ప్రైవేట్ సంస్థల కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు కలిస్తే అంతరిక్ష రంగంలో ప్రపంచంలోని అగ్రదేశాలతో భారత్ పోటీ పడగలదనే విశ్వాసాన్ని విక్రమ్-1 విజయం కలిగించింది.

ADVERTISEMENT
Latest Stories