పవన్ కళ్యాణ్… ప్రస్తుతం ఈ పేరు సినీ ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగుతోందో, రాజకీయ వర్గాల్లోనూ అంతేస్థాయిలో హంగామా చేస్తోంది. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఏర్పరచుకున్న తరుణంలో… మరో మూడు రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పై “అజ్ఞాతవాసి” రూపంలో పవన్ దర్శనమివ్వనున్నాడు. తాజాగా ధియేటిరికల్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, అంచనాలను అందుకుంది కూడా! త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, టేకింగ్, పవన్ మార్క్ మేనరిజంస్ తో కూడిన ఈ ట్రైలర్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు నచ్చేయడంతో తొలి 12 గంటల్లోనే 2 మిలియన్ మార్క్ క్లిక్స్ ను దాటి దూసుకెళ్తోంది.
పవన్ ఎలా అయితే సినీ – పొలిటికల్ వర్గాలకు చేరువ అయ్యారో… ఈ ట్రైలర్ లో వినిపించే ఓ డైలాగ్ కూడా వర్తమాన రాజకీయాలను ప్రతిబింబిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకారం అందించిన పవన్, పరోక్షంగా ‘సైకిల్’ ఎక్కినంత పనిచేసారు. ఈ ట్రైలర్ లో కూడా మురళీ శర్మ చేత ‘మళ్ళీ సైకిల్ ఎక్కుతాడా వర్మ?’ అనే డైలాగ్ చెప్పించడం వర్తమాన రాజకీయాలకు దగ్గరగా ఉందని చెప్పవచ్చు. అలాగే ‘వాడు ఏదేక్కినా పర్లేదు గానీ, మనల్ని ఎక్కకుండా ఉంటే చాలు’ అన్న రావు రమేష్ డైలాగ్ కూడా నేటి ఏపీ పొలిటికల్ సినారియోను వినిపిస్తోంది. దీంతో ‘అజ్ఞాతవాసి’లో పరోక్షంగా వర్తమాన రాజకీయాలపై పంచ్ లకు ఆస్కారం ఉందన్న విషయం స్పష్టమైంది.
మరో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో… సినిమాలో వినిపించిన మాదిరే మరోసారి సైకిల్ ఎక్కితే, ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టడం ఖాయం అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాత్రం తన ఎజెండా ‘సింహం సింగిల్ గా వస్తుందన్న’ చందంగా చెప్తున్నప్పటికీ, రాజకీయాలలో ఎప్పుడు, ఏదైనా జరగవచ్చు గనుక, మరోసారి సైకిల్ ఎక్కినా ఎక్కవచ్చు, అందుకు సంకేతంగానే సినిమాలో ఈ డైలాగ్ కూడా పెట్టి ఉండవచ్చన్న మాట అని చర్చించుకోవడం నెటిజన్ల వంతవుతోంది. ఏది ఏమైనా… “అజ్ఞాతవాసి”లో సైకిల్ ఎపిసోడ్ అదిరిపోవడం ఖాయమని స్పష్టంగా చెప్పొచ్చు.



