పవన్ కళ్యాణ్… ఎంత పని చేసావయ్యా..!

Pawan Kalyan Ticket Prices Andhra pradeshసినిమా టికెట్ ధరల అంశం ఎంత రచ్చ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నుండి ప్రారంభమైన ఈ రగడలో, ఇప్పటివరకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ తీరు పైనే విమర్శలు వెలువడ్డాయి. వైసీపీ తరపున మాట్లాడిన పేర్ని నాని, కొడాలి నాని, రోజా మరియు సీఎం జగన్ వ్యాఖ్యలు ఎక్కువ చర్చనీయాంశంగా నిలిచాయి.

కానీ ఈ ఉదంతంలో అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఇండస్ట్రీపై ఎంతో ప్రభావం చూపే టికెట్ ధరల అంశానికి నుండి సినీ వర్గీయుల నుండే పెద్ద ఎత్తున ‘వైసీపీ అండ్ కో’కు మద్దతు లభిస్తుందన్న విషయం నానాటికి స్పష్టమవుతోంది. దీంతో ఇండస్ట్రీలో అసలు అవకాశవాదులు ఎవరో, నిజాయితీగా ఓ విషయంపై పోరాడేవారు ఎవరో సినీ అభిమానులకు తెలిసి వస్తోంది.

ADVERTISEMENT

ఇప్పటివరకు ‘అభిమానం’ అనే పేరుతో ఏళ్ళ తరబడి తమ భుజాలపై మోసిన హీరోల అసలు రంగులు ఒక్కొక్కరుగా బయట పడుతుండడంతో, ‘అభిమానం’ స్థానంలో ‘ఆవేదన’ వచ్చి చేరుతోంది. వీరేనా… సిల్వర్ స్క్రీన్ పైన ‘అద్భుతాలు’ చేసే హీరోలు అని ఆశ్చర్యపడాల్సి వస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, హీరోల కంటే ఎక్కువగా అభిమానులే టికెట్ ధరలపై మదనపడుతున్నారు.

‘రిపబ్లిక్’ సినీ వేదికపై గళమెత్తిన పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా మద్దతు పలికిన హీరో ఒక్క నాని మాత్రమే కాగా, వ్యతిరేకించే వారి సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ‘మా’ ఎన్నికల సమయంలో హడావుడి చేసిన సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ లేఖ ఇండస్ట్రీ వర్గాలను ప్రశ్నిస్తూ రాసి, బహిరంగంగానే జగన్ కు మద్దతు ప్రకటించారు. అలాగే నాగార్జున తాజా వ్యాఖ్యల గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఒకప్పుడు వీరందరికి ఇండస్ట్రీ ఆసరానిచ్చింది. ఆ కీర్తి ప్రతిష్టలతో రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక వ్యాపారాలు జరుపుకుంటున్న నేపథ్యంలో… ప్రస్తుతం సినిమా కంటే వ్యాపారాలే ముఖ్యమై ఉండవచ్చు. అలాంటపుడు అసలు ఈ టికెట్ ధరలపై స్పందించకుండా ఉంటే, సినీ పరిశ్రమకు మంచి చేయకపోయినా నష్టం చేకూర్చే వారు కాదు.

రాజకీయంగా వైసీపీతో ఎంతో సత్సంబంధాలు కలిగిన రాంగోపాల్ వర్మ, టికెట్ ధరలపై ఓపెన్ గా జగన్ సర్కార్ నిర్ణయాన్ని నిలదీస్తుంటే, అంతకుమించిన స్థాయి, పలుకుబడి ఉన్న ఈ పెద్దలంతా ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా తేలిన విషయం ఏమిటంటే… ‘మేమంతా ఒకే కుటుంబం’ అంటూ మీడియా ముందు ఫోజులిచ్చే కార్యక్రమాలన్నీ శుద్ధ అబద్ధాలని!

ఇండస్ట్రీలో ‘ఐక్యత’ లేకపోవడమే ప్రత్యర్థి వర్గానికి కొండంత బలంగా మారిందన్న విషయం పట్టనట్లుగా సినీ పరిశ్రమ కనపడుతోంది. బ్రిటిష్ సిద్ధాంతం మాదిరి ‘విభజించు – పాలించు’ అన్నదే సినీ పరిశ్రమ నానుడిగా మారిపోతోంది. బహుశా పవన్ వలన ఈ సమస్య వెలుగులోకి వచ్చిందేమో గానీ, ఇది ఒక్క పవన్ కళ్యాణ్ సమస్య మాత్రమే కాదు.

ఇపుడు అదే పవన్ కారణంగా ప్రేక్షకుల దృష్టిలో వైసీపీ వర్గం కన్నా హీరోలే దోషులుగా మిగులుతున్నారు. ఈ టికెట్ ధరల వివాదం కారణంగా ఒక్కటైతే మంచి జరిగినట్లే. ‘అభిమానం’ పేరుతో గుడ్డిగా మూసుకుపోయిన ఆయా హీరోల ఫ్యాన్స్ కళ్ళు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఈ కోవలో ఇంకెంత మంది హీరోలు ఉన్నారో… ఇంకెన్ని మాటలు వినాలో… క్లైమాక్స్ ట్విస్ట్ లు ఎలా ఉంటాయో..!?

ADVERTISEMENT
Latest Stories