ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా టికెట్ ధరలు సర్దుమణగలేదు, మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేడు ఫిబ్రవరి 25వ తేదీ నుండి పెద్ద సినిమాల విడుదలలు ప్రారంభం అవుతాయని ప్రకటన ఇచ్చారు. మరి ముందుగా ప్రేక్షకుల తలుపు తట్టబోయే పెద్ద సినిమా ఏదన్న చర్చ అభిమానుల్లో నెలకొని ఉంది.
నిజానికి ఫిబ్రవరి 25వ తేదీన పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదల కావాల్సి ఉంది. ఇప్పటివరకు అధికారికంగా వాయిదా ప్రకటన చేయలేదు గానీ, ఇదే తేదీన శర్వానంద్ – రష్మికల “ఆడవాళ్ళు మీకు జోహార్లు” సినిమా రిలీజ్ డేట్ ఇవ్వడంతో, ‘భీమ్లా నాయక్’ వాయిదా పడిందన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే, దానికి ఎదురుగా మరో సినిమాను రిలీజ్ చేసే సాహసం శర్వానంద్ వంటి హీరోలు చేయరు. మరి శర్వానంద్ సినిమాతో పాటు రిలీజ్ కాబోయే పెద్ద సినిమా ఏమిటి? సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే… మళ్ళీ ‘భీమ్లా నాయక్’ ఒక్క సినిమాకే ఆ అవకాశాలు కనపడుతున్నాయి.
ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రెండు తేదీలను ప్రకటించాయి, అందులో కూడా ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుందన్న సంకేతాలు వచ్చేసాయి. మార్చిలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ పాన్ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోంది. ఏప్రిల్ 1వ తేదీకి ‘ఆచార్య’ రెడీ అయ్యింది. ‘కేజీఎఫ్ 2’ యధావిధిగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.
ఒక్క ‘భీమ్లా నాయక్’ విషయంలోనే ఇప్పటివరకు స్పష్టత లేదు. ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేయడానికి ఏపీలో టికెట్ ధరల అంశం ఒక్కటే ‘భీమ్లా నాయక్’కు ఉన్న ప్రధాన సమస్య. అది ఉన్నా కూడా రిలీజ్ చేసే సాహాసాన్ని పవన్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఫిబ్రవరి 25 కాకపోతే మరో ప్రత్యమ్నాయ తేదీ అంటే దాదాపుగా మే మాసం ఒక్కటే కనపడుతోంది.