సముద్రాన్ని దాటి లంకకు చేరిన హనుమంతుడి ముందు ఎవరు ఎంతగా ఎగిరినా అవి కుప్పిగంతులే అవుతాయి. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిస్థితి ఇప్పుడు అలాగే మారింది.
ఆమె బీఆర్ఎస్ పార్టీకి పోటీగా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని తండ్రి కేసీఆర్‌పైనే విమర్శలు గుప్పించారు. అయన హయంలో భారీగా అవినీతి జరిగిందని, పేదలకు సామాజిక న్యాయం జరగలేదని విమర్శిస్తున్నారు.
ఆమె బీఆర్ఎస్ పార్టీకి, దాని అధినేత కేసీఆర్ ప్రతిష్టకు భంగం, నష్టం కలిగిస్తున్నప్పటికీ ఆమె సోదరుడు కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ పార్టీలో అందరూ మౌనంగా ఉండిపోయారు. అసలు ఆమె ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారనే విషయం కూడా తెలియనట్లు పట్టించుకోకుండా ఉండిపోయారు.
ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆమెపై ఎదురుదాడి చేస్తుంటే ఆమెకు తప్పకుండా ప్రజల సానుభూతి, గుర్తింపు లభించేది. కానీ ఆమెను బీఆర్ఎస్ పార్టీ నేతలెవరూ పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె జనసేనాని పవన్ కళ్యాణ్ పేరుతో రాజకీయ కాలక్షేపం చేస్తున్నారు.
ఆమె తెలంగాణ ప్రజల హృదయాలలో నాటుకుపోయిన ‘టీఆర్ఎస్’ పేరుని పొందగలిగారు. కానీ దానినీ ఇప్పుడు నిలుపుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
ఆ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియజేయమని కేంద్ర ఎన్నికల కమీషన్ సూచన మేరకు సుమారు 700 మందికి పైగా లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలిపారు. వారిలో బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఎక్కువ మంది ఉంటారని వేరే చెప్పక్కరలేదు.
కేసీఆర్, కేటీఆర్ ఆమె విమర్శలకు సమాధానం చెప్పలేదు. ఆమె చేస్తున్న రాజకీయ హడావుడిని పట్టించుకోలేదు. కానీ ఆమె పార్టీ మనుగడనే ఈవిధంగా ప్రశ్నార్ధకంగా మార్చే ప్రయత్నం చేస్తూంటే హనుమంతుడి ముందా కుప్పి గంతులు?అని అనుకోకుండా ఉండగలమా?






