
తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓడలు బళ్ళువుతాయి బళ్ళు ఓడలవుతాయనే పాత నానుడి గుర్తుకు రాక మానదు.
శాసనసభ ఎన్నికల ముందు వరకు దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయిలో కేసీఆర్ ఉండేవారు. అదే సమయంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కూడా తిరుగే ఉండేది కాదు.
Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమలో తాము కుమ్ములాడుకుంటూ తన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలతో సతమతమవుటుండేవారు.
ఇక్కడ జగన్ చేతిలో చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు అష్ట కష్టాలు అనుభవిస్తుండేవారు. చివరికి చంద్రబాబు నాయుడు జైలుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది. టిడిపి నేతలు వైసీపి వేధింపులు భరిస్తుండగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి, వైసీపి నేతల అవహేళనలు, అవమానాలు భరిస్తుండేవారు.
Also Read – వ్యవస్థలకి జగన్ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!
కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కేసీఆర్ పరిస్థితి తారుమారు అయ్యింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితని సీబీఐ అరెస్ట్ చేసి జైల్లో వేస్తే మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆమెను కేసీఆర్ విడిపించుకోలేకపోతున్నారు.
జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక నవ్వులపాలవుతున్నారు.
Also Read – జనసేన ‘చిరు’దరహాసం…!
ఈసారి 175 సీట్లు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో దారుణంగా ఓడిపోయి నవ్వులపాలయ్యారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలపై బిఆర్ఎస్ పార్టీ మనుగడ ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. ఆయన కనుసైగ చేస్తే బిఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అయిపోతుంది.
ఇన్ని ఆటుపోట్లు తట్టుకొని నిలబడి పార్టీని కాపాడుకున్న చంద్రబాబు నాయుడు బుధవారం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వైసీపి కంటే చాలా భారీ మెజార్టీతో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాబోతోంది.
గత ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన 8 స్థానాలలో జనసేన ఓడిపోయింది. కానీ ఏపీ శాసనసభ ఎన్నికలలో జనసేన 22 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ శాసనసభలో అడుగుపెడుతూనే ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నట్లు సమాచారం.
నాడు చంద్రబాబు నాయుడుని జగన్ అరెస్ట్ చేసినప్పుడు మోడీ, అమిత్ షాలు కనీసం ఖండించలేదు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలో, ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా మారారు.
ఇప్పుడు వీరి ఐదుగురి రాజకీయ ప్రస్థానం చూసినప్పుడు ఓ విషయం అర్దమవుతుంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎటువంటి భేషజాలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శిస్తూ విజయం సాధించగా, కేసీఆర్, జగన్ ఇద్దరూ చాలా అహంభావంతో వ్యవహరిస్తూ స్వయంగా నష్టపోయి, పార్టీలను కూడా నష్టపరుచుకున్నారని అర్దవుతోంది.
రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ నిశబ్ధంగా ముందుకు సాగుతూ విజయం సాధించగా, కేసీఆర్, జగన్ ప్రగల్భాలు పలుకుతూ ఉవ్వెత్తున ఎగిసిపడి ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి అధః పాతాళానికి పడిపోయారు. అంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఎంచుకున్న మార్గాలు, వారి విధానాలు సరైనవని, కేసీఆర్, జగన్‌వి తప్పని రుజువు అయ్యింది.