దేవ్ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ సినిమా వేదిక మీద పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో. టికెట్ ధరల అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడిన నాటి పవన్ కళ్యాణ్ ప్రసంగం అప్పటికప్పుడు మాట్లాడింది కాదు, అది ముందుగానే ప్రిపేర్ అయ్యారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడానికి దర్శకుడు వెళ్ళినపుడు వస్తానని చెప్పిన పవన్, ఈ ఈవెంట్ లో తన మనసు విప్పి మాట్లాడాలని అనుకుంటున్నట్లుగా దేవ్ కట్టాకు ముందే చెప్పారట. ఫలానా అంశాలపై మాట్లాడతానని పవన్ తన అనుమతి కోరినట్లుగా దేవ్ కట్టా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాను ఓపెన్ గా మాట్లాడితే సినిమాకు ఏమైనా ఇబ్బంది అవుతుందని తలచి, ముందుగానే దర్శకుడి అనుమతి తీసుకోవడంలో పవన్ ఔచిత్యం కనపడుతోంది. అంటే టికెట్ ధరల అంశం ఎప్పటి నుండో మాట్లాడాలని భావించిన పవన్ కు “రిపబ్లిక్” సరైన వేదిక అయినట్లుగా భావించినట్లున్నారు. అయితే పవన్ ఇచ్చిన ఆవేశపూరితమైన ప్రసంగం అభిమానుల మెప్పు పొందిందేమో గానీ, ఇండస్ట్రీ వర్గాలు మాత్రం పెదవి విరిచాయి.
నేడు టికెట్ ధరల సమస్య ఇంత జఠిలం కావడానికి నాడు పవన్ చేసిన ప్రసంగమే పునాది అన్న అభిప్రాయం ఇండస్ట్రీకి చెందిన అత్యధికులలో నెలకొని ఉంది. ఒకవేళ పవన్ అలా మాట్లాడి ఉండకపోతే నేడు టికెట్ ధరల సమస్య ఉండదా? అంటే దానికి ట్రేడ్ వర్గాలలో సమాధానం లేదు. కానీ పవన్ ప్రసంగం ద్వారా సమస్యను జఠిలతరం చేసి, దానికి ప్రధాన కారణం జనసేన అధినేత అని ఎత్తిచూపడంలో జగన్ సర్కార్ విజయవంతం అయ్యింది.



