టీడీపిని కమ్మ, జనసేనని కాపు, బిజేపిని హిందూ, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ… ఇలా ఒక్కో పార్టీకి ఒక్కో కోణంలో ప్రజలు, నాయకులు చూస్తుంటారు.
వీటిలో బిజేపి, బీఆర్ఎస్ పార్టీలు తమ ‘బ్రాండ్ ఇమేజ్’ నిలుపుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఆ కోణంలో నుంచే రాజకీయాలు చేస్తుంటాయి.
కానీ వాటికి భిన్నంగా టీడీపి మైనార్టీ, బీసీలకు పార్టీలో, ప్రభుత్వంలో సమానావకాశాలు ఇస్తున్నప్పటికీ దానికున్న ‘కమ్మ ముద్ర’ని తొలగించుకోలేకపోతోంది. జనసేన పరిస్థితి కూడా ఇదే.
అయితే టీడీపికి నాలుగున్నర దశాబ్దాల బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది కనుక ఆ ‘కమ్మటి ముద్ర’ వలన దానికి ఎటువంటి ఇబ్బందీ లేదు.
కానీ తొలిసారిగా ఎన్నికలలో గెలిచి, అధికారంలోకి వచ్చిన జనసేనకు ఈ ‘కాపు ముద్ర’ చాలా ఇబ్బందికరంగా మారుతోంది.
అలాగని పవన్ కళ్యాణ్‌ని ‘మనోళ్ళు’ ఎవరైనా ఓ కాపు కాస్తున్నారా? అంటే అదీ లేదు. ఇటీవల హైదరాబాద్ ప్రెస్‌మీట్ తర్వాత ఆయనపై తెలంగాణలో అన్ని పార్టీలు, వర్గాల వారు విరుచుకుపడితే మనోళ్ళలో ఒక్కరంటే ఒక్కరు ముందుకు వచ్చి ఆయనకు అండగా నిలబడలేదు. ఆయనని విమర్శిస్తున్నవారికి జవాబు చెప్పాలనుకోలేదు. కానీ లింగమనేని రమేష్‌కి రాజ్యసభ సీటు ఇవ్వగానే ఆ మనోళ్ళే ఆయనపై విరుచుకుపడుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే జనసేన దాని అధినేత పవన్ కళ్యాణ్ పట్ల మనోళ్ళకి భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ వైసీపీ అధినేత జగన్‌తో సహా ఆ పార్టీ నేతలు వారి సొంత మీడియా, వారి సోషల్ మీడియా వారియర్స్‌కి పవన్ కళ్యాణ్, జనసేనపై చాలా బలమైన నిశ్చితాభిప్రాయాలున్నాయి.
అందుకే నాటి నుంచి నేటి వరకు పవన్ కళ్యాణ్‌పై బురద జల్లుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణలో అసమదీయులతో కలిసి పవన్ కళ్యాణ్‌ని తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
కానీ ‘మనోళ్ళు’ ఒక్కరికీ అయన మాటలలో హేతుబద్దత కనిపించలేదు. కనుక స్పందించలేదు. పవన్ కళ్యాణ్‌కి తోడుగా నిలబడలేనివారికి ఆయన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎక్కడిది?
చివరిగా ఒక మాట: కొంతమంది ఆయనని, జనసేన పార్టీని ఎల్లప్పుడూ ‘కాపు కోణం’లో నుంచి మాత్రమే చూస్తుంటారు. అలా మాత్రమే చూడగలరు. వేరేలా చూడలేరు. కనుక అటువంటి వారికి అయన ఆలోచనలు, మాటలు, నిర్ణయాలు అన్నీ విచిత్రంగా తప్పుగానే అనిపిస్తుంటాయి. కనుక మారాల్సింది పవన్ కళ్యాణ్ లేదా జనసేన కాదు. ఆయనని కాపుగా చూస్తున్నవారే మారాలి.
పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు కూడా వీలైనంత త్వరగా తమకి అంటుకున్న ఈ ‘కాపు ముద్ర’ తొలగించుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడే పవన్ కళ్యాణ్ అందరివాడు అవుతారు. జనసేన అందరి పార్టీ అనే భావన అన్ని వర్గాల ప్రజలకు కలుగుతుంది.




