ఈ నెల 14, 15, 16 మూడు రోజుల పాటు జనసేన పార్టీ ప్రత్యేక సమావేశాలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో నిర్వహించడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో పుట్టి ఏపీలో రాజకీయంగా ఎదుగుతున్న జనసేన ఇప్పటికి తన పుట్టింటిలో రాజకీయంగా నిలదొక్కుకోలేకపోతుంది.
అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అసలు జనసేన పార్టీ ఊసే తెలియని దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం వెనుక ఉన్న వ్యూహమేంటి అనేదాని మీద ఇప్పుడు చర్చ మొదలయ్యింది. ఇందుకుతగ్గట్టే ఎవరి ఊహలకు తగ్గట్టు వారు ఎవరి కి నచ్చిన రీతిలో వారు విశ్లేషణలు మొదలుపెట్టారు. ఇందులో అనేక వాదనలు తెరమీదకొచ్చాయి.
అయితే పవన్ రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలకు షిఫ్ట్ కొట్టబోతున్నారని, అందులో భాగంగానే జనసేనాని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ అప్పుడే ఒక వాదన ప్రచారంలోకి వచ్చింది. దీనితో పవన్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారా.? అందుకే తన అడుగులు ఢిల్లీ వైపు వెళుతున్నాయా.? అంటూ జనసేనాని చుట్టూ ప్రశ్నల వలయాలుగా ఏర్పడుతున్నాయి.
హైద్రాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పవన్ ఇంటికి వెళ్లడం ఆ తరువాత పవన్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగడం, ఇప్పుడు జనసేన పార్టీ సమావేశాల కోసం పవన్ ఎన్నడూ లేని విధంగా ఢిల్లీని ఎంచుకోవడం వెనుక బీజేపీ, జనసేన మధ్య అంతర్గత రాజకీయాలు నడుస్తున్నాయా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బీహార్ మాదిరి ఏపీలో కూడా భవిష్యత్ లో కూటమి నాయకత్వ మార్పులు జరగబోతున్నాయా.? అందులో భాగంగానే పవన్ ముందుగానే జనసేనను జాతీయవేదికల మీదకు తెస్తున్నారా.? జాతీయవాదం నింపుకున్న ప్రాంతీయ పార్టీ జనసేన మూల సిద్ధాంతం అంటూ పవన్ తన ప్రసంగాలలో పదేపదే పేర్కొంటారు. ఈ వాదనకు బలం చేకూర్చేందుకు తాజాగా పవన్ జాతీయ మీడియాకు ఇచ్చిన పాడ్ కాస్ట్ లను ఉదాహరణలుగా చూపుతున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడం, పవన్ హైద్రాబాద్ లో ఎలా అడుగుపెడతారో చూస్తాం అంటూ కాంగ్రెస్ మంత్రుల నుంచి ఎమ్మెల్యే వరకు పవన్ పై రాజకీయ, వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు.
దీనితో పవన్ సైతం అదేస్థాయిలో తెలంగాణ నీ అయ్యా జాగీరా అంటూ చాల ఘాటుగా బదులిచ్చారు. భారతదేశంలో తెలంగాణ ఒక అంతర్భాగం, అటువంటి తెలంగాణలో కి ఒకరిని రావద్దనడం, వేరొకరిని రాజకీయం చేయ్యోద్దనడం అప్రజాస్వామ్యం అంటూ పవన్ తన పై మాటల దాడి చేసిన వారి పై విరుచుకుపడ్డారు.
అలాగే తెలంగాణలో గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎప్పుడు వినపడని, కనపడని ఈ ప్రాంతీయవాద హెచ్చరికలు కాంగ్రెస్ రాకతో మళ్ళీ పురుడు పోసుకుంటున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతీయవాద రాజకీయాన్ని దాటి ముందుకు రావాలని కోరుకున్నారు.
అయితే తాజాగా పవన్ తన పార్టీ ప్రత్యేక సమావేశాల కోసం ఢిల్లీని ఎంచుకోవడం కూడా కాంగ్రెస్ నాయకులకు కౌంటర్ ఇచ్చేందుకేనా అంటూ మరోవాదన తెరమీదకొచ్చింది. ఈ సువిశాల భారతదేశంలో ఎవరు ఎక్కడైనా సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చని, ఏ పార్టీ ఎక్కడైనా రాజకీయాలు చెయ్యొచ్చని తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొట్టే వారికీ తెలియచెప్పడానికే పవన్ తన పార్టీ ఉనికే లేని ఢిల్లీలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారా.? అనేది మరోవాదన.




