రాజకీయాల్లో మార్పు… ఎన్నాళ్ళ నుండో ప్రజలు కోరుకుంటోంది. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజా జీవితాలను పెడదోవ పట్టించడమనేది ఇప్పటివరకు ప్రజలకు తెలిసిన రాజకీయాలు. ఎన్నో సంవత్సరాలుగా అలవాటు పడిపోయిన ఈ రాజకీయాలను సమూలంగా మార్చడం సాధ్యమేనా? దానికి సమాధానం మాత్రం ‘దొరకడం’ కష్టం గానీ, అందుకు అనుగుణంగా తొలి అడుగు పడిందని మాత్రం చెప్పవచ్చు. అవును… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ సిద్ధాంతాలలో భాగంగా ఓ కీలక ప్రకటన వెలువడింది.
“దేశ స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఆవిర్భాల దినోత్సవాలను మాత్రమే పార్టీ వేడుకలుగా చేసుకుంటుందని, ఆ రోజులను మాత్రమే సెలవు దినాలుగా పరిగణిస్తామని” కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న ‘వ్యక్తి పూజ’కు తిలోదకాలు ఇస్తూ… వ్యక్తి జయంతులనేవి రాజకీయాల కోసం ఏర్పాటు చేసినవేనని, అలాంటి వాటిని ‘జనసేన’ పరిగణనలోనికి తీసుకోదని, అలాగే మతపరమైన పండుగలను, పర్వదినాలను సెలవులుగా ప్రకటించడమనేది రాజకీయాల్లో భాగంగా అని తేల్చేసింది.
జాతీయ సమగ్రతకు ఇలాంటి అంశాలు దోహదపడవని, అందుకే వాటిని వ్యతిరేకిస్తుందని ‘జనసేన’ జారీ చేసిన ఓ స్పష్టమైన ప్రకటన నవతరం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రాజకీయాల్లో మార్పు కావాలని ఆశిస్తున్న వారిని ఈ సిద్ధాంతాలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే కొత్త నాయకులను తయారు చేయడం కూడా ‘జనసేన’ లక్ష్యాలలో ఒకటిగా ఉంది. అయితే ఇవన్నీ పేపర్ వరకు పరిమితం కాకుండా, కార్యరూపం సిద్ధించుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.



