టీటీడీ కొత్త ఈవో నియామకం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై స్థానిక ఐఏఎస్ అధికారులలో అసంతృప్తి వ్యక్తం కావడంతో, వారి ఆవేదనను భుజాన వేసుకున్న ‘జనసేన’ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం ప్రధాన అంశంగా మారిపోయింది. పవన్ చేసిన ట్వీట్ తో అధికార పక్ష నేతల నుండి రాజకీయంగా కౌంటర్ దాడులు సహజంగానే మొదలయ్యాయి.
అయితే ఇంతకీ పవన్ చేసింది రైటా? రాంగా? టీటీడీ ఈవో నియామకంపై ఇంతగా పవన్ స్పందించాల్సిన అవసరం ఉందా? అంటే పవన్ అసంతృప్తి రాష్ట్ర ప్రభుత్వంపై కాదు, కేంద్ర ప్రభుత్వం పైన అన్న సమాధానం లభిస్తోంది. అయితే ఈ విషయంలో కేంద్రం ఇందులో నేరుగా సీన్ లో ఉండదు గనుక, సదరు పదవిని నియమించే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారని పొలిటికల్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. టీటీడీలో ఉత్తరాది వారి ఆధిపత్యం కోసం గత కొన్నాళ్లుగా అంతర్లీన పోరాటం జరుగుతోందని మీడియా వర్గాలు ప్రత్యేక కధనాలు కూడా ప్రసారం చేసాయి.
అయితే వారికి నామమాత్రపు పదవులను మాత్రమే కట్టబెడుతూ, కీలక బాధ్యతలను మాత్రం రాష్ట్రానికి చెందిన నాయకులకు, అధికారులకు మాత్రమే అప్పగించే ఆనవాయితీ ఇప్పటివరకు అనుసరించారు. కానీ, ఈ సారి అలా జరగకపోవడానికి ప్రధాన కారణం కేంద్రం నుండి వచ్చిన ఒత్తిడేనని పొలిటికల్ టాక్. ఈ సారి టీటీడీ ఈవో పదవిని ఖచ్చితంగా ఉత్తరాదికి చెందిన వారిని ఎంపిక చేయాలని కేంద్రం నుండి స్పష్టమైన సంకేతాలు అందడంతో, మరో ప్రత్యామ్నాయం లేక అనిల్ కుమార్ ఎంపిక జరిగిందన్న సమాచారం లభిస్తోంది. దీనిని పవన్ ప్రశ్నించడంలో తప్పులేదు గానీ, పవన్ కున్న సినీ బ్యాక్ గ్రౌండ్ రీత్యా ఇది ‘బూమ్ రాంగ్’ అవుతోంది.
ఉత్తరాది నుండి ‘గబ్బర్ సింగ్’ వంటి కధలను అరువు తెచ్చుకుని తెలుగులో హిట్లు కొట్టిన పవన్ ఇలా ఉత్తరాది – దక్షిణాది అంటూ మాట్లాడడం తగదని కౌంటర్లు వస్తున్నాయి. రాజకీయాలలో ఇలాంటి విమర్శలు సహజం గనుక, వీటికి ప్రాధాన్యత ఇచ్చినా, లేకున్నా, నిజంగా పవన్ కు చిత్తశుద్ధి ఉంటే, ఇలా ట్వీట్లు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదన్న విషయం గుర్తించాలి. సదరు ట్వీట్ లో కూడా… రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాది వ్యక్తిని ఎందుకు నియమించిందో వివరం తెలపాలని మాత్రమే అభ్యంతరాలు తెలిపారు తప్ప, వారిని తొలగించాలని మాత్రం డిమాండ్ చేయకపోవడం గమనించదగ్గ అంశం.
ఇటీవల కాలంలో ‘ఉత్తరాది – దక్షిణాది’ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న ‘జనసేన’ అధినేత, నిజంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే తప్ప ఏ విధమైన ప్రభావం కనిపించే అవకాశం లేదు. ఇలా ట్వీట్లు చేసుకుంటూ వెళితే… టిడిపి నేత వర్ల రామయ్య విమర్శించినట్లు… పవన్ నిజంగానే పబ్లిసిటీ కోసమే ఇలాంటి సంచలన ట్వీట్లు చేస్తున్నారన్న విషయం ప్రజల్లో బలపడే అవకాశం ఉంది. అది పవన్ పొలిటికల్ కెరీర్ కు మరింత ప్రమాదకరం. ఏ అంశం పైన అయినా ఒక స్టాండ్ తీసుకుంటే… అందుకు తగిన వ్యూహరచన కూడా చాల అవసరం. అలా కాకుండా ట్వీట్లతో తాత్కాలికంగా ఉపశమనం చెందాలనుకుంటే మాత్రం కుదిరే అంశం కాదు!



