తెలుగు రాజకీయాలు ఏనాడో భ్రష్టు పట్టుకుపోయినవి. ఒకప్పుడు ఉండే నిర్ణయాత్మక చర్చలు, విమర్శలు పోయి ఇప్పుడు తిట్లు, బూతులు వాటి స్థానంలో వచ్చేసాయి. దీంట్లో అన్ని పార్టీలకు తలా కొంచెం వాటా ఉంది. రోజా, కొడాలి నాని, గంగా భవాని ఇలా లిస్ట్ చాలా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రినే కామ సీఎం అని సంబోధించిన, స్పీకర్ సాక్షిగా ఒక మహిళా ఎమ్మెల్యేను అసభ్య పదజాలంతో దూషించిన అది ఇప్పటిదాకా వైకాపాకు మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా వరకే ఉండింది.
అయితే తాజాగా రాష్ట్ర రాజకీయాల్లోకి మరింత బూతు నీరు చేరింది. ఏ పార్టీకు చెందను అని చెప్పుకుంటూ వైకాపాకు సపోర్ట్ చేస్తున్న కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ వీరవిధేయుడిని అని చెప్పుకునే సినీ నిర్మాత బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ గత కొంత కాలంగా కత్తి మహేష్ చేస్తున్న ఎదురుదాడి చుట్టూ ఈ బూతు రాజకీయం నడుస్తుంది. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ వల్ల నష్టపోయాం అని భావిస్తున్న వైకాపా ఆయనను చంద్రబాబు తొత్తుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా రోజా ను దింపారు.
రోజా, కత్తి మహేష్ లను ఎదురుకోవడంలో ఒకరకంగా జనసేన ఇబ్బంది పడుతుందనే చెప్పుకోవాలి. ఆ పార్టీకి ఉన్న సినిమా అభిమానులు అసలు విమర్శను తట్టుకోలేరు వారిని ఉడికించి ఇరికిస్తున్నారు రోజా, కత్తి మహేష్. వారిని తిప్పి కొట్టడానికి జనసేనకు అధికారికంగా ఎవరు లేకపోవడంతో బండ్ల గణేష్ లాంటి వాళ్ళని కూర్చోబెడుతున్నారు టీవీ వాళ్ళు. ఒకసారి మైక్ ముందు ఉంటే ఏం మాట్లాడతారో ఆయనకే తెలియని బండ్ల గణేష్ వాళ్ళ జనసేనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. లైవ్ ప్రోగ్రాంలో బండ్ల రోజా మధ్య జరిగిన సంభాషణ అందరిని సిగ్గుపడేలా చేసింది. రోజా కాకుండా వేరే ఎవరైనా అవతల వైపు ఉంటే అది జనసేనకు ఇబ్బందిగా పరిణమించేది.





