ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లలో మూడు టీడీపి తీసుకొని ఒకటి జనసేనకు ఇచ్చింది. ఇదివరకు బిజేపికి రెండు సీట్లు ఇచ్చినందున ఈసారి రాజ్యసభ సీటు కోసం బిజేపి పట్టుబట్టలేదు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ జనసేనకు ఇచ్చిన సీటుని కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు కేటాయించడంతో ఈ మాత్రం దానికి సీటు తీసుకోవడం దేనికి? అదేదో టీడీపియే అట్టేబెట్టుకుంటే సరిపోయేది కదా? అంటూ జనసేనలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. వాటి పక్కనే వైసీపీ రాగాలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే లింగమనేని రమేష్‌కు రాజ్యసభ సీటు కేటాయించబోతున్నట్లు పది రోజుల క్రితమే చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్, అందుకు బలమైన కారణం కూడా చెప్పారు.
“2019 ఎన్నికలలో జనసేన ఓటమి తర్వాత కాపు నేతలందరూ మొహం చాటేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం జనసేనని కేసులతో ముప్పతిప్పలు పెట్టింది. అలాంటి సమయంలో జనసేనలో చేరేందుకు ఎంతటి వారైన సాహసించరు. కానీ లింగమనేని రమేష్ కమ్మ, కాపు అని కులాలు చూడకుండా జనసేనలో చేరి మనకు అండగా నిలబడ్డారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనకి అన్ని విధాల సాయపడిన ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తే దానినీ ‘మనోళ్ళు’ తప్పు పడుతున్నారు. నేను కుల బలం చూసుకొని రాజకీయాలలోకి రాలేదు. కులం మద్దతుతో అధికారంలోకి రావాలనుకోలేదు. కులాల ఐక్యత కోరుకున్నాను. అన్ని కులాల వారికీ సమాన ప్రాధాన్యం ఇచ్చాను.
కనుక లింగమనేని రమేష్‌కి సీటు ఇవ్వాలనుకున్నాను, ఇక్కడ కులం గురించి ఆలోచించడం లేదు. పార్టీ ప్రయోజనాల గురించే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నా నిర్ణయమే ఫైనల్. పార్టీలో అందరూ నా నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే,” అని జనసేనాని వారం పది రోజుల క్రితమే చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాటకే కట్టుబడి లింగమనేని రమేష్‌కి రాజ్యసభ సీటు కేటాయించారు.
వైసీపీ హయంలో అనేకమంది జనసేన జెండా పట్టుకొని కేసులు ఎదుర్కొని, లాఠీ దెబ్బలు తిని, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగినవారున్నారు. వారందరినీ కాదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్‌కి ఇవ్వడంపై అసంతృప్తి సహజం.
కానీ వారందరూ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభకు పోటీ చేయాలనుకున్నారు. కానీ కూటమిలో సీట్ల సర్దుబాట్ల వలన నాగబాబుకి టికెట్ ఇవ్వలేదు. ఆయన పరిస్థితి అర్థం చేసుకొని రాష్ట్రం, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనుకొని ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడి పనిచేశారు.
ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా? అలాగే తనకు అండగా నిలబడి పార్టీని గెలిపించుకున్న వారికి ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చారు కదా? కనుక పార్టీ కోసం కష్టపడినవారికి కాస్త ముందూ వెనుకగా తప్పకుండా అవకాశం లభిస్తుంది.
కానీ వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం. దానిని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకోవడం ముఖ్యం. ఆ ప్రయత్నంలో అందరికీ ఆమోదయోగ్యం కాని ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని పార్టీలో అందరూ గ్రహించడం చాలా అవసరం.




