ఇటీవల కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. స్థానిక ఫార్మా పరిశ్రమలు సముద్రంలోకి కాలుష్య జలాలు వదులుతుండటంతో చేపలు చనిపోతున్నాయని, తమ జీవనోపాధి కోల్పోతున్నామని, తక్షణం ఆ పరిశ్రమలు మూసివేయాలని కోరుతూ ఆందోళన చేశారు.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తూ తనకు ఓ వారం రోజులు సమయం ఇస్తే స్వయంగా వచ్చి కలుస్తానని, అంతవరకు ఆందోళనలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. దాంతో వారు ఆందోళన విరమించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చిన మాట ప్రకారం నేడు కాకినాడకు వచ్చి కలెక్టర్ కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో ముఖాముఖి సమావేశమయ్యారు.
వారు చెప్పిన సమస్యలను సావధానంగా విని అక్కడికక్కడే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కాలుష్య నివారణ మండలి అధికారులను తక్షణం ఆయా పరిశ్రమలలో ఆడిట్ చేసి వారం రోజులలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు తాను చేపట్టిన చర్యలను వారికి వివరించారు. కాలుష్య నివారణ మండలి నివేదిక రాగానే తగు చర్యలు చేపడతానని పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు.
సముద్రంలో వేటకు వెళ్ళిచనిపోయిన 18 మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున భీమా సొమ్ము చెక్కులను స్వయంగా అందించారు.
ప్రజా సమస్యలు మంత్రి లేదా ఎమ్మెల్యేల దృష్టికి వచ్చినప్పుడు ఏవిదంగా స్పందించాలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆచరించి చూపి కూటమి ప్రభుత్వంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు.
మత్స్యకారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పవన్ కళ్యాణ్ పరిష్కరించలేకపోవచ్చు. కానీ వారికి ఏదైనా సమస్య వస్తే నేనున్నానే నమ్మకం, భరోసా పవన్ కళ్యాణ్ కల్పించగలిగారు.
ప్రజాప్రతినిధులు అందరూ ఈవిదంగా బాధ్యతాయుతంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలలో ఎంతమంది పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లాగ వెంటనే స్పందిస్తున్నారు?అని ఎవరికీ వారు ప్రశ్నించుకోవడం చాలా అవసరం. అప్పుడే ప్రజలు కూడా ఇది మంచి ప్రభుత్వం అని భావిస్తారు. మళ్ళీ అధికారం కట్టబెడతారు.




