నేను పోరాటం చేస్తుంది తన రాజకీయ అవసరాల కోసం సొంత కుటుంబాన్ని కూడా రోడ్డుకు ఈడ్చగల వ్యక్తులతో అంటూ ప్రత్యర్థి బలాన్ని బాగానే అంచనా వేయగలిగిన పవన్ తన సొంత బలాన్ని పెంచుకోవడవంలో ఎందుకింత నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారో అర్ధం కాకా తలలు పట్టుకుంటున్నారు జనసైనికులు.
ప్రత్యర్థి రోజు గడిస్తే సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారానికి, ప్రతిపక్షాలు మీద విమర్శలు చేయడానికి సిద్ధమవుతుంటే పవన్ మాత్రం అడపదడపా కనిపిస్తూ పార్టీ అభిమానులను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నారు. మిత్ర పక్షమైన టీడీపీ కూడా రా కదలిరా…అంటూ ప్రజల ముందుకొస్తుంటే పవన్ మాత్రం ఇంకా పార్టీ తరుపున పోటీ చేయబోయే అభ్యర్థులను కూడా నిర్దారించలేకపోతున్నారు.
పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాల సంఖ్య 24 గా తెలిసినప్పటికీ అందులో మొదటి జాబితా కింద కేవలం ఐదుగురి అభ్యర్థుల పేర్లు, ఐదు నియోజకవర్గాల పేర్లు మాత్రమే వెల్లడించారు. మిగిలిన ఆ 19 స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ కూడా ఇంతవరకు ప్రకటించలేదు పవన్.
పార్టీ సంస్థాగతముగా ఇంకా బలపడలేదు…, పార్టీకి బూత్ స్థాయి నాయకత్వం లేదు.., కమిటీలు లేవు.., ఆర్థికంగా బలపడిన నాయకులు లేరు అంటూ తన పార్టీ బలహీనతలు తానే బయటపెట్టి ప్రత్యర్థికి అవకాశం కల్పించిన పవన్ కనీసం పార్టీ నేతలకు తాను పోటీ చేయబోయే స్థానాల పై సూచన ప్రాయంగా అయినా తెలియచేస్తే అక్కడి గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి ఆ నేతలకు కొంత అవకాశం దొరుకుతుంది.
సొంత పార్టీ క్యాడర్ ను సిద్ధం చేసుకోవాలి.అలాగే మిత్ర పక్ష పార్టీ క్యాడర్ ను సమన్వయ పరుచుకోవాలి. ప్రత్యర్థి పార్టీ బలాన్ని అంచనా వేయగలగాలి. ఇదంతా చేయడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. ఈ తంతు పూర్తి చేసుకుని పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్ళడానికి జనసేన కు సమయం సరిపోతుందా.? 24 నా అంటూ నిట్టూర్చి నేతలు కనీసం పోటీ చేస్తున్న ఈ 24 లో సింహ భాగం సీట్లలో విజయం సాధించి ముందుకు రాగలిగితేనే జనసేన పార్టీకి భవిష్యత్తు బాగుంటుంది.
బీజేపీ కోసం ఎదురు చూస్తూ ఎంతో విలువైన ఎన్నికల సమయాన్ని పవన్ వృధా చేస్తున్నారు అనేది జనసైనికుల నుండి వస్తున్న ఆరోపణ. పార్టీ స్థాపించి దాదాపు దశాబ్దం గడుస్తున్నా ఇంకా పార్టీ సంస్థాగతంగా బలపడలేదు అంటే దానికి కారణం ఎవరు..? పార్టీ ని బలపరిచే పద్దతి ఇదేనా..? అటు సినిమాలు చేయక ఇటు పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లక ఇంకెన్నాళ్లు జనసేన ను చంటి పిల్లాడితో పోలుస్తారు..?
రాజకీయాలలోకి వచ్చి మాటలు , అవమానాలు, ఛీత్కారాలే తప్ప పదవులు అనుభవించలేదు, డబ్బులు సంపాదించలేదు అంటూ బాధపడుతూ కాలం వెళ్లతీస్తే రాజకీయాలలో రాణించడం కష్టం. వేల కోట్ల ఆస్తులు, పెద్ద పెద్ద ప్యాలస్ లు, వెనుక బలమైన రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ 2019 ఎన్నికల సమయంలో జగన్ గత ఎన్నికలలో ప్రజల చేత తిరస్కరించబడ్డాను అనే నిస్సహాయతలోకి వెళ్లిపోలేదు.
ప్రజల నమ్మకం పొందడానికి మరింత కష్టపడ్డాడు. పాదయాత్రలు చేసాడు, కనిపించిన వారికీ ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్రలు చేసుకుంటూ నిత్యం ప్రజల మధ్యే గడిపారు చివరికి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ తరువాత ఎం చేశారన్నది ఇక్కడ అప్రస్తుతం. తానూ ముఖ్యమంత్రి పదవిని చేప్పట్టడానికి ఏంచెయ్యాలో అంతా చేసారు జగన్.
అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో పవన్ కు ఆదర్శమనే చెప్పాలి. తనను రాజకీయంగా తొక్కేయాలని చుసిన సొంత పార్టీ నుండి, కేసీఆర్, కేటీఆర్ వంటి బలమైన నేతల ఒత్తిళ్ల నుండి, పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ వేధింపుల నుండి నిలదొక్కుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు రేవంత్. ఇదంతా కూడా ఎదో ఒకరోజులో జరిగిపోయే అద్భుతం కాదు.
అలాగే లోకేష్ ఉదంతాన్ని తీసుకున్నా తాను గత ఎన్నికలో ఓడిపోయాను అనే బాధ నుండి ఈసారి నేను ఓడించేవాడినవ్వాలి కానీ ఓడిపోయేవాడిని కాకుడదు అనే పట్టుదలతో పడ్డ చోటే నిలబడ్డాడు. పట్టు సాధించాడు. ఇప్పుడు కేవలం ఒక లోకేష్ ని ఓడించడానికి జగన్ ఇప్పటికే ముగ్గురు ఇంచార్జ్ లను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా వైసీపీ నేత గెలుస్తాడు అనే నమ్మకం రాలేదు. కానీ పవన్ ఈ తరహా రాజకీయాలు చేయకుండా ఆరు నెలలకో సారి బయటకు వచ్చి నన్ను నమ్మలేదు అంటూ ఆరోపించి మళ్ళీ కనుమరుగైపోతున్నారు.
రాజకీయాలలో నిలబడాలి అంటే ప్రజలను మెప్పించడం ఎంత అవసరమో, అడ్డుచ్చిన వారిని తొక్కుకుంటూ పోవడం కూడా అంటే అనివార్యం. బీజేపీ పొత్తు కోసం ఎదురుచూస్తూ ఉన్నా విలువైన సమయాన్ని పార్టీ కోసం వెచ్చించకుండా వేచి ఉండడం తన పార్టీకే కాదు మిత్ర పక్షానికి పెద్ద దెబ్బగానే పరిగణించాలి. ఇప్పటికైనా తన బలహీనతను పక్కన పెట్టి తన బలాన్ని గుర్తించి ప్రజాక్షేత్రంలోకి రాగలిగితే వైసీపీ కి వచ్చిన అధికారం అనే కొమ్ములను వంచడం అంత కష్టమేమి కాదు.
పవన్ హనుమంతుడిలా తన బలాన్ని తాను తెలుసుకోలేడు. మిగిలిన రాజకీయ నాయకుల పది సభల ఇంపాక్ట్ పవన్ ఒక్క సభతో తీసుకురాగలుగుతారు. వారాహి యాత్రతో ప్రజా క్షేత్రంలోకి వచ్చిన పవన్ జనసేన పార్టీని వారాహి ముందు ఆ తరువాత అనే స్థాయికి తీసుకు వచ్చారు. అటువంటి యాత్రలకు బ్రేక్ ఇచ్చి ఎవరి కోసమో పడిగాపులు పడడం పవన్ అవివేకమే అవుతుంది.





