జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఏర్పడిన విభేదాలు ఒకానొక సందర్భంలో తార స్థాయికి వెళ్లిపోయాయి. టీడీపీ నేత SVSN వర్మ కు జనసేన నేతలకు మధ్య ఏర్పడిన రాజకీయ అఘాతం ఇప్పట్లో ముగుస్తోందా.? లేక 2029 ఎన్నికలలో కూటమికి తలనొప్పిగా మారుతుందా అన్నంత స్థాయికి ఈ రెండు పార్టీల మధ్య పరోక్ష మాటల పోరు నడిచింది.
దీనితో ఇరు పార్టీల అధినేతలు ఈ రెండు పార్టీల వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నేడు పవన్ పిఠాపురం పర్యటన పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. పవన్ పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసారు.
అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీల అమలుకు రిబ్బన్ కట్ చేయడం వంటి కార్యక్రమాలతో పవన్ పిఠాపురం షెడ్యూల్ మొత్తం పూర్తిగా బిజీ బిజీగా గడిచింది. అయితే ఈ నేపథ్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల పనులకు టీడీపీ నాయకుడు వర్మను పవన్ పిలుస్తారా.? వర్మ ఆ ఆహ్వానాన్ని స్వీకరించి అక్కడికి వస్తారా అన్న ఆసక్తి ఇరు పార్టీల క్యాడర్లోనూ నెలకొంది.
అయితే ఎలా అయినా కూటమి పార్టీల మధ్య బంధం విచ్ఛిన్నం అవ్వాలని వేయి కళ్లతో, కోటి ఆశలతో కళ్ళల్లో ఒత్తులేసుకుని మరి ఎదురుచూస్తున్న వైసీపీ పార్టీకి పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య ఏర్పడిన ఈ రాజకీయ పంచాయితీ కాస్త ఊపిరి పోసింది. దీనితో ఇక ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ సోషల్ మీడియా ఎన్నో ఊహాగానాలకు తెరలేపి కొంతకాలం పైశాచిక ఆనందాన్ని అనుభవించింది.
అయితే ఆ ఆనందాన్ని నేడు వర్మ వారికి దూరం చేశారనే చెప్పొచ్చు. పిఠాపురంలో పవన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో, హామీల అమలు చర్యలలో పవన్ కళ్యాణ్ తో పాటుగా వర్మ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేస్తానని పవన్ ఇచ్చిన హామీకి నేడు శంకుస్థాపన జరిగింది.
ఈ సమయంలో పవన్ తో పాటుగా వర్మ కూడా అక్కడే ఉన్నారు. పవన్ కూడా వర్మను ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేసేందుకు తన వంతుగా ఆయనకు తగిన ప్రాధాన్యత నిచ్చారు. అలాగే టీటీడీ కళ్యాణ మండపం, చేబ్రోలు శ్రీ సీత రామ స్వామి ఆలయ రథశాల, మండపం శంకుస్థాపన, మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారభించడం వంటి కార్యక్రమాలు పవన్ పర్యటనలో భాగమమయ్యాయి.
దీనితో వర్మ మీద నాగబాబు చేసిన పరోక్ష విమర్శలు, దానికి కౌంటర్ గా వర్మ వర్గం చేసిన ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా పక్కదారి పట్టినట్టయింది. ఇక ఇక్కడితోనైనా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలకు ఇరు పార్టీల నేతలు ఫుల్ స్టాప్ పెట్టడం కూటమి బంధాన్ని బలపరుస్తాయి.






