జనసేనాని పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తున్నారు. మహిళా కమీషన్ కూడా క్షమాపణ లేదా సంజాయిషీ కోరుతూ పవన్ కళ్యాణ్‌కి నోటీస్ పంపింది. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై తన అభిప్రాయాలను చాలా వివరంగా తెలియజేసి తన వాదనలను గట్టిగా సమర్దించుకొన్నారు.
ఆయన ఏలూరులోని దెందేలూరులో వీరమహిళలు (జనసేన కార్యకర్తలు)తో మాట్లాడుతూ, “నాకు వాలంటీర్ల మీద ఎటువంటి కోపమూ లేదు. వాలంటీర్ల పొట్టకొట్టాలని కూడా అనుకోవడం లేదు.
గంపెడు పళ్లలో ఒక్క కుళ్ళిన పండు ఉన్నట్లయితే గంపెడు పళ్ళు కూడా కుళ్ళిపోతాయి. అలాగే లక్షలమంది వాలంటీర్లలో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. కొందరు ఆడబిడ్డలను వేధిస్తున్నారు. కొందరు నిసహాయులైన వృద్ధుల పింఛన్ సొమ్ము కాజేస్తున్నారని జనవాణి కార్యక్రమంలో మాకు ప్రజలే పిర్యాదులు చేశారు. ఇటీవల ఓ వాలంటీర్ ఓ ఆరేళ్ళ పాపపై అత్యాచారం చేసిన వార్త అందరూ చూశారు. రాష్ట్రంలో 29,279 మహిళలు అదృశ్యం అయ్యారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ తెలుపుతున్నాయి.
వాలంటీర్లు ప్రభుత్వోద్యోగులు కారు. కానీ వారిని ఇంటింటికీ పంపించి ఇంట్లో వారి వివరాలు సేకరిస్తోంది. ఇంట్లో మహిళలు, పిల్లలు, కుటుంబం ఆర్ధిక పరిస్థితి వంటి వివరాలు వారు ఏ హోదాతో సేకరిస్తున్నారు? అసలు మన వివరాలు వారికి ఎందుకు ఇవ్వాలి? ఆ వివరాలు సచివాలయాల నుంచి ఎక్కడెక్కడికి పోతున్నాయి?రాష్ట్రంలో ప్రజల వ్యక్తిగత వివరాలు ఎవరి చేతుల్లోకో వెళ్లిపోతుంటే ఎందుకని అడగకూడదా?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఇక వాలంటీర్ వ్యవస్థలో మరో కోణం గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. “ప్రజాధనంతో వాలంటీర్లకు జీతాలు చెల్లిస్తూ మళ్ళీ ప్రజలపైనే వారిని గూడఛారులుగా పెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. వారిద్వారా ప్రజల వివరాలు సేకరిస్తోంది. సంక్షేమ పధకాల గురించి ప్రచారం చేయించుకొంటోంది. లబ్ధిదారులు చెప్పిన్నట్లు వినకపోతే సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని బెదిరిస్తోంది. ఈ కారణంగా వాలంటీర్లు అపవాదు భరిస్తున్నారు.
వాలంటీర్లు కేవలం నెలకు రూ.5,000 జీతం కోసమే పనిచేస్తున్నారు. ప్రభుత్వం వారికి మంచి ఉద్యోగాలు, ఉపాధి కల్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయాల్సి ఉండగా కేవలం రూ.5,000 చెల్లించి వారి చేత వైసీపీకి ఊడిగం చేయించుకొంటూ వారి జీవితాలు నాశనం చేస్తోంది. వారి జీవితంలో అప్పుడే నాలుగేళ్ళు వృధా అయిపోయాయి.
ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించుకొని జీవితంలో స్థిరపడాల్సిన యువత, ఈవిదంగా వైసీపీ కోసం సృష్టించిన ఈ వాలంటీర్ వ్యవస్థలో చిక్కుకుపోయి తమ జీవితాలు నాశనం చేసుకొంటున్నారని నేను బాధపడుతున్నాను తప్ప వాలంటీర్ల మీద నాకు ఎటువంటి కోపం, ద్వేషం లేవు.
ఏం వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేయలేదా? రేషన్ అందలేదా? పింఛన్లు అందలేదా?వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు అన్ని వ్యవస్థలు పనిచేస్తూనే ఉండేవి కదా? కానీ వైసీపీ ప్రభుత్వం దీంతో ఓ సమాంతర వ్యవస్థను సృష్టించి అంతా అస్తవ్యస్తం చేస్తోంది.
ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఓ ఊబి వంటిది. రూ.5,000కి ఆశపడి దానిలో దిగితే ఇంకా ఇంకా కూరుకుపోతారే తప్ప ఎన్నటికీ బయటపడలేరు. మంచి ఉద్యోగాలు సంపాదించుకోలేక జీవితాలు కూడా నాశనం అవుతాయి,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.



