ఇప్పటివరకు ‘ప్రత్యేక హోదా’పై ‘జనసేన’ అధినేత స్పందించలేదు… స్పందించలేదు… అన్నారు. తీరా విషయం దగ్గరికి వచ్చేపాటికి ‘నా వల్ల ఏం కాదని’ పవన్ తేల్చేసారు. కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి తన కొడుకు సినీ రంగప్రవేశం సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్… ‘స్పెషల్ స్టేటస్’పై క్లుప్తంగా స్పందించారు. ‘ప్రత్యేక హోదా’ అనేది చాలా సున్నితమైన విషయమని, కేంద్రంతో వైరం పెట్టుకుని సాధించేది ఏమీ లేదని, అధికారంలో ఉన్న ఎంపీల వలనే సాధ్యం కాని విషయం తన వలన ఎలా సాధ్యమవుతుందని పవన్ స్పష్టంగా చెప్పేసారు.
‘ప్రత్యేక హోదా’ను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ దిశగా కార్యాచరణ చేయాలని అన్నారు. ఇక, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పుష్కరాల ఆహ్వానంపై స్పందిస్తూ… ఏపీ ప్రభుత్వం నుండి తనకు ఆహ్వానం అందలేదన్న వార్తల్లో నిజం లేదని, ఆహ్వానం అందిందనని స్పష్టత ఇచ్చారు. పవన్ చేసిన ఈ ప్రకటనతో ‘చంద్రబాబుకు – పవన్ కు’ మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. అవి కేవలం కాలయాపన పుకార్లుగానే తేలిపోయింది.
అయితే ‘ప్రత్యేక హోదా’ అంశంపై పవన్ స్పందించిన తీరు మాత్రం ఒక రకంగా విమర్శలకు తావిస్తోంది. నాడు మోడీతో పలు మార్లు భేటీ అయిన పవన్, ఏపీకి ఆయువుపట్టు లాంటి ‘స్పెషల్ స్టేటస్’ అంశంపై కనీసం ఒక్కసారి కూడా ఎందుకు చర్చలు జరపడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే కనీస పోరాటపటిమ కూడా ప్రదర్శించకుండా తన వల్ల ఏమీ కాదని తేల్చేయడమన్నది భవిష్యత్తులో పవన్ రాజకీయ జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



