ఆదివారం జరిగిన “సర్ధార్ గబ్బర్ సింగ్” ఆడియో వేడుకను చూసిన తర్వాత… అసలు ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ ను ఎందుకు పెట్టారు? అనే ప్రశ్న ప్రేక్షకుల మదిలో మెలగడం సహజమే. ఇద్దరు మెగా సోదరుల మధ్య అనుబంధం ఎంత ఉందో చూపించుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక సభలా దర్శనమిచ్చింది తప్ప, ఒక సినిమా ఆడియో వేడుక మాదిరి కనపడక పోవడం విశేషం.
బహుశా తమపై వస్తున్న పుకార్లకు పులిస్టాప్ పెట్టాలని ఈ సభను… అదేలే… ఈ సర్ధార్ ఆడియో వేడుకను నిర్వహించినట్లుగా కనపడుతోంది. పోనీయ్… సభ పెట్టి ఏమైనా కొత్త విషయాలు చెప్పారా… అంటే… అది లేదు. తిప్పిన రీల్ నే చిరంజీవి, పవన్ లు కలిసి అటు తిప్పి, ఇటు తిప్పి చెప్పిందే చెప్పి ప్రేక్ష్లకుల సహనానికి కారణమయ్యారన్న టాక్ బలాన్ని పెంచుకుంటోంది.
ఎప్పుడు హుందాగా మాట్లాడే చిరంజీవి తన స్థాయిని పూర్తిగా తగ్గించుకుని, ఆయన కూడా ఒక సగటు పవన్ అభిమాని మాదిరి వ్యాఖ్యానించడం మెగాస్టార్ ఎంత డిఫెన్స్ ఆలోచనల్లో ఉన్నారో తెలియజేస్తోందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు పవన్ కూడా చిరు తిప్పిన రీల్ నే మరోసారి తిప్పుతూ… ఏకంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకపైన ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ పేరును ప్రస్తావించకపోవడం అత్యంత శోచనీయం. దీంతో అసలు ఈ ఆడియో వేడుకకు సార్ధకత లేదని విమర్శకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.
ఒకరినొకరు తప్పక పోగుడుకోవాలి కాబట్టి… ప్రశంసలు కురిపించుకోవడం తప్ప… నిజంగా వచ్చిన మాటల మాదిరి దర్శనమివ్వలేదు. కృత్రిమమైన నవ్వుకు – సహజమైన నవ్వుకు ఎంత వ్యత్యాసం ఉంటుందో… వీరిద్దరూ కురిపించుకున్న ప్రశంసలకు కూడా అంతే వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరిలోకల్లా చిరంజీవి ముఖ్యంగా పవన్ ను బలవంతంగా పొగడాలని పొగిడినట్లు కనపడుతుందే తప్ప సహజంగా కలిగిన అనుభూతుల మాదిరి కనపడడం లేదని వీక్షకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు. దీంతో ఈ ఆడియో వేడుక ఇద్దరి మెగా సోదరుల ‘భజన’కు మాత్రమే దోహదం చేసిందన్న టాక్ సోషల్ మీడియాలో తీవ్రంగా హల్చల్ చేస్తోంది.



