ఓ రెండు, మూడు నెలల క్రితం… మీడియాలో పెద్ద రచ్చకు దారితీసిన శ్రీరెడ్డి ఉదంతం తెలియనిది కాదు. “కాస్టింగ్ కౌచ్ పై దండయాత్ర చేసిన శ్రీరెడ్డి, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, పలువురు ప్రముఖుల ఫోటోలు బయటపెట్టగా, ఇంకొన్ని త్వరలో” అంటూ చెప్పుకొచ్చిన వైనం తెలిసిందే. నిజంగా ఆమె వద్ద ఆధారాలు ఉంటే, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యల దిశగా సాగాలని పవన్ కళ్యాణ్ వంటి వారు స్పందించారు.
[m9ad]
అక్కడ మ్యాటర్ కట్ చేసి, వర్తమానానికి వస్తే… గురువారం నాడు సంచలన ఆరోపణలకు జనసేన అధినేత తెరలేపారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని, దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్ కూడా తన దగ్గర ఉందని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్, మొత్తం ముగ్గురు వ్యక్తులు తన హత్యకు కుట్రలు పన్నారని, ఆ ముగ్గురూ ఎవరో కూడా తనకు తెలుసనీ, కానీ ఇప్పుడు నేను చెప్పదలచుకోలేదని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు తన హత్య అనంతరం… అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారని, ఇదంతా వచ్చే ఎన్నికల లోపు ముగించేయాలని చూస్తున్నారని ఆరోపణలు చేసారు జనసేన అధినేత. నిజానికి పవన్ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదేం కొత్తకాదు. గతంలో కూడా ఇలా తనపై హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ప్రస్తావించారు కానీ, శ్రీరెడ్డి మాదిరిగానే మైక్ ముందు హడావుడే గానీ, నిజమైన ఆధారాలను చూపించలేకపొతున్నారు.
ఒకవేళ పవన్ చెప్పింది వాస్తవమే అయితే, కాల్ రికార్డింగ్ ఉండి కూడా ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు? ఆ ముగ్గురు లేక ఇద్దరు ఎవరు? ఎందుకు వారి పేర్లు బయట పెట్టడం లేదు? ఇలా బెదిరింపు రాజకీయాలు దేనికి ఉపయోగం? శ్రీరెడ్డికి చెప్పిన ఉచిత సలహా పవన్ కళ్యాణ్ ఎందుకు పాటించడం లేదు. అంటే “నీతులు చెప్పడానికేనా… ఆచరించడానికి కాదా..?” అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఆరోపణలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారారు పవర్ స్టార్.



