హైదరాబాద్ లోని జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కొండగట్టుకు బైయల్దేరిన పవన్ కల్యాణ్ కు ఆయన భార్య లెజినోవా ఎదురొచ్చి హారతినిచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు కొండగట్టు చేరుకోనున్న పవన్, కొండగట్టులో పూజల తర్వాత యాత్ర ప్రణాళిక ప్రకటిస్తారు. ఈ యాత్రతో తెలంగాణ కాంగ్రెస్ లో కలవరపాటు మొదలయ్యింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకున్న తర్వాతే ఆయన కొండగట్టులో అడుగుపెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. మిగతా కాంగ్రెస్ నేతలు కూడా అదే విధంగా స్పందించడంతో ఆ పార్టీ కలవరపాటులో ఉందని చెప్పకతప్పదు.
దీనికి కారణం లేకపోలేదు. జనసేన ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అని వారి ఆందోళన. పవన్ కళ్యాణ్ తెరాస పంచన చేరితే ఆయన ద్వారా వచ్చే యువకుల సపోర్ట్ అధికార పార్టీకి ప్లస్ అవుతుందనే అనుకోవాలి. ఒకవేళ ఆయన ప్రభుత్వంపై తిరగబడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును పంచుకునే ఇంకో పార్టీ వచ్చినట్టే.
దీనివల్ల అధికార పార్టీ లాభపడుతుంది. గతంలో ప్రజారాజ్యం వచ్చినప్పుడు 2009 ఎన్నికలలో అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ కు ప్లస్ అవడం మన అందరికి తెలిసిందే. ఆ విధంగా ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ వల్ల కాంగ్రెస్ కు ఇబ్బంది లానే ఉంది. కాబట్టి జనసేన పార్టీ కాంగ్రెస్ కు తలపోటు అనే చెప్పుకోవాలి.





