తెలుగుదేశం నేతలు చేస్తున్న కామెంట్లతో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారా? అంటే అలాంటి సంకేతాలే ట్విట్టర్ వేదికగా వ్యక్తమవుతున్నాయి. గతంలో కేంద్రమంత్రి అశోక గజపతి రాజు, తాజాగా రాష్ట్ర మంత్రి పితాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… పవర్ స్టార్ ఓ ‘ఎటకారపు’ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. “అశోకగజపతి రాజు గారికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు… మంత్రి పితాని గారికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు… సంతోషం…” అంటూ సింపుల్ గా చేసిన ట్వీట్ కలకలం రేపింది.
అయితే నిజంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. సమస్యలను మాత్రమే సీరియస్ గా తీసుకుంటానని చెప్పే పవన్, ఇలాంటి సిల్లీ అంశాలపై స్పందించి తన స్థాయిని తానే తగ్గించుకోవడమెందుకు? అన్న రీతిలో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేతల మాటలు తెలియనివి కావు. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ రాజకీయ నాయకులు ఒకే రకమైన దోవలో పయనిస్తున్నారు.
అది నచ్చకే రాజకీయాలను శుభ్రపరచడానికి వచ్చానని చెప్పిన పవన్, మళ్ళీ వాటికి కౌంటర్లు వేయడం, మళ్ళీ వాళ్ళు రీ కౌంటర్స్ వేయడం… ఇవన్నీ రొటీన్ గా మారిపోయి, అసలు సమస్యను పక్కదోవ పట్టించే ప్రమాదం కనపడుతోంది. ఇది నాణానికి ఒకవైపు కాగా, భవిష్యత్తులో టిడిపి నేతలకు ప్రమాద ఘంటికలు మోగించడానికి తాను సిద్ధం అవుతున్నాననే సంకేతాలను ఈ ట్వీట్ ద్వారా దేశం నేతల్లోకి పంపారా? లేక తనకు తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారా? అన్న ప్రశ్నలు కలుగుతున్నాయి.





