విశాఖలో పవన్‌ యాత్ర: కొన్ని ప్లస్సులు, మైనస్సులు

Pawan Kalyanజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మొదటి రెండు విడతల వారాహి యాత్రలతో అదరగొట్టేశారు. మొదట కులసమీకరణాల గురించి, రెండోసారి యాత్రలో వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడి రాష్ట్ర రాజకీయాలలో చాలా వేడి పుట్టించారు. ముఖ్యంగా తమకే ఎదురేలేదని విర్రవీగుతున్న వైసీపీ నేతలను హడలెత్తించి ఢిల్లీకి పరుగులుతీసేలా చేశారు. కనుక వారాహి విజయయాత్రల క్రెడిట్ పవన్‌ కళ్యాణ్‌దే.

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు మూడో విడత వారాహి యత్రకు సిద్దం అవుతున్నారు. ఈనెల 10 నుంచి 19వరకు విశాఖ జిల్లాలో పర్యటిస్తూ, విశాఖలో జరిగిన భూకబ్జాల గురించి మాట్లాడబోతున్నారంటూ జనసేన బాంబు పేల్చింది.

ADVERTISEMENT

జగన్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ళలో విశాఖలో రాజధానిని ఏర్పాటుచేయలేకపోయినా ఆ పేరు చెప్పుకొని వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొంటూ వాటి కోసం విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆ గొడవల కారణంగానే వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భార్య, కొడుకు, వారి కుటుంబ స్నేహితుడైన ఆడిటర్‌ని కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగిందని వార్తలు వచ్చాయి. కనుక వారి భూకబ్జాల చిట్టా పట్టుకొని వైజాగ్‌ వస్తున్న పవన్‌ కళ్యాణ్‌, వారి అవినీతి భూభాగోతాలన్నీ బయటపెట్టి ఎండగట్టడం ఖాయం. కనుక వారందరికీ టెన్షన్ మొదలైన్నట్లే.

విశాఖ రాజధాని చేస్తామంటూ గత ఏడాది మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలే రోడ్లపై నిరసన ర్యాలీలు, బహిరంగసభలు, రౌండ్ టేబిల్ సమావేశాలు కూడా నిర్వహించి చాలా హడావుడి చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు. అందరూ సైలంట్ అయిపోయారు. అంటే ఆ ప్రతిపాదన కూడా అటకెక్కించేశారా?

ఒకవేళ విశాఖను రాజధానిగా మార్చాలంటే ముందు నగరాన్ని అందుకు తగ్గట్లుగా అభివృద్ధి చేయాలి. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దొండపర్తి జంక్షన్‌ వరకు వేసిన ఒకే ఒక్క ఫ్లైఓవర్‌ నేటికీ కనబడుతోంది. అది తప్ప నగరంలో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్‌ జగన్ ప్రభుత్వం నిర్మించలేకపోయింది. కనుక పవన్‌ కళ్యాణ్‌ తన పర్యటనలో నగర అభివృద్ధి గురించి ప్రశ్నించడం ఖాయమే.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పెట్టుబడిదారులను విశాఖ రాజధాని అని మభ్యపెట్టేందుకు త్వరలోనే తాను విశాఖకు మకాం మార్చబోతున్నానని సిఎం జగన్‌ చెప్పారు. కనీసం ఇంతవరకు ఆ చిన్న పని కూడా చేయలేకపోయారు. పవన్‌ కళ్యాణ్‌ దీని గురించి కూడా ప్రశ్నించవచ్చు. బహుశః అందుకే సిఎం జగన్‌ విశాఖ ప్రజలకు దసరాకు ఓ శుభవార్త చెప్పబోతున్నారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ అప్పుడే బిస్కట్ విసిరారు.

భూకబ్జాలు, విశాఖ రాజధాని గురించి పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నలకు వైసీపీ నేతల వద్ద సంతృప్తికరమైన సమాధానాలు ఉండవు కనుక వారు పవన్‌ కళ్యాణ్‌ మీద ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించవచ్చు. దానిలో మూడు పెళ్ళిళ్ళు, బ్రోలో శ్యాంబాబు పాత్ర, ఆ సినిమా పెట్టుబడిలో అవకతవకలు జరిగాయంటూ వాదించవచ్చు. వాటికి పవన్‌ కళ్యాణ్‌ ధీటుగానే సమాధానం చెప్పుకోగలరు. కానీ జనసేన, బిజెపిలు పొత్తులో ఉన్నందున ఆయనను వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు సైతం ప్లాంట్‌ అమ్మకం గురించి నిలదీయవచ్చు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు గురించి వైసీపీ నేతలు కూడా నిలదీయవచ్చు. కనుక పవన్‌ కళ్యాణ్‌ వారి ప్రశ్నలకు సమాధానాలు సిద్దం చేసుకొని రావడం మంచిది.

ADVERTISEMENT
Latest Stories