వైసీపీ హయంలో ప్రతీ నెలా బటన్ నొక్కుడు సభలు జరుగుతుండేవి. నేటికీ తాము మాత్రమే ప్రజలకు మేలు చేశామని చెప్పుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటే కోడిగుడ్డుకి ఈకలు పీకినట్లు తప్పులు వెతుకుతున్నారు.
స్త్రీ శక్తి పధకం వలన ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్లని ఆదుకునేందుకు ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే పధకం ప్రవేశపెట్టింది.
మాజీ మంత్రి పేర్ని నాని దీని గురించి మాట్లాడిన మాటలు వింటే నవ్వొస్తుంది. ఆయన సిఎం చంద్రబాబు నాయుడుని ఎద్దేవా చేయాలనుకున్నారు. విమర్శించాలనుకున్నారు. కానీ అయన నోటితోనే “రాష్ట్రంలో 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు చెల్లించింది,” అని నాలుగు సార్లు చెప్పారు. ఓ ప్రతిపక్షనేత నోటి నుంచి ఈ మాటలు రావడం ప్రశంశగానే భావించవచ్చు.
“సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ప్రసంగాలకు పాపం.. ఆటో డ్రైవర్ల చెవులలో నుంచి రక్తాలు కారాయి. కానీ కూర్చొని వినక తప్పలేదు. ఆటో డ్రైవర్ల కోసం ఓ మొబైల్ యాప్, కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తానని సిఎం చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకున్నారు. దాంతో వారికి ఇక బేరాలే బేరాలట,” అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.
గతంలో బటన్ నొక్కుడు సభలకు వాలంటీర్లతో లబ్దిదారులను ఏవిదంగా బెదిరించేవారో, వారిని రప్పించేందుకు ఏమేమి చేసేవారో, సభకు వచ్చినవారు మద్యలో వెళ్ళిపోకుండా ఏమేమి చేసేవారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నాడు ఈవిదంగా వ్యవహరించి, ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు సభని పేర్ని నాని విమర్శిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?
ఒకవేళ ప్రభుత్వం ఈ పధకాన్ని అమలుచేయకపోతే ఎందుకు చేయలేదని వైసీపీ తప్పక ప్రశ్నిస్తుంది. కానీ అమలు చేయడంతో దీనిని వ్యతిరేకించలేక, అలాగని తప్పు పట్టలేక పేర్ని నాని కోడిగుడ్డుకి ఈకలు పీకే ప్రయత్నం చేసి నవ్వులపాలయ్యారు.
సిఎం చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల చేతిలో ఓ 15వేలు పెట్టి చేతులు దులుపుకోవాలనుకోకుండా వారి కోసం ఓ మొబైల్ యాప్, దాని నిర్వహణకు ఓ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తానన్నారు. తమకు కలగని ఇటువంటి సరికొత్త ఆలోచన సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నందుకు సంతోషించాలి కదా?కానీ దానినీ పేర్ని నాని ఎద్దేవా చేశారు.
డ్వాక్రా మహిళా సంఘాలు, రైతు బజార్లు, మొబైల్ గవర్నెన్స్ వంటి అనేక ఆవిష్కరణలు చేసిన సిఎం చంద్రబాబు నాయుడు, ఆటో డ్రైవర్ల కోసం ఓ యాప్ రూపొందింఛి అమలుచేయలేరా? అని పేర్ని నాని ఆలోచించి ఉండి ఉంటే ఈవిదంగా కువిమర్శలు చేసేవారేకారు కదా?







