శిశుపాలుడు-వంద తప్పులు: పిన్నెల్లి పూర్తి చేసేశారా?

Pinnelli Rama Krishna Reddy

కోడి కత్తి, గొడ్డలి వేటుతో గత ఎన్నికలలో వైసీపి లాభపడింది కానీ ఈసారి ఎన్నికలలో అల్లర్లు, ముఖ్యంగా ‘పిన్నెల్లి ఈవీఎం’ ఎపిసోడ్‌ వైసీపి పరువు తీసేశాయి. ఈ అల్లర్ల కారణంగా డిజిపితో సహా పలువురు ఎస్పీలు, పల్నాడు జిల్లా కలెక్టర్‌పై కూడా ఈసీ వేటు వేసి విచారణకు ఆదేశించడాన్ని జగన్‌ ప్రభుత్వం తప్పు పడుతోందే తప్ప అప్రదిష్టగా భావించడం లేదు.

వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి మాచర్ల నుంచి పారిపోవడంతో వైసీపి అరాచకాలను స్వయంగా ధృవీకరించుకుంటే, అంబటి రాంబాబు వంటివారు అతితెలివిగా మాట్లాడుతూ ఆ హీట్ తగ్గకుండా తమ అరాచకాలకు మంచి ప్రచారం కలిగేలా కూడా చేస్తున్నారు.

ADVERTISEMENT

అయితే అవినాష్ రెడ్డిని వెనకేసుకు వచ్చి పరువు తీసుకుంటున్నట్లుగానే ఇప్పుడు పిన్నెల్లిని వెనకేసుకువస్తూ పరువు తీసుకుంటున్నామని జగన్‌, సజ్జల ఎవరూ గ్రహించలేదని అనుకోలేము. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలను చూసి యావత్ దేశం అబ్బురపడుతుందని జగన్‌ నమ్మకంగా చెప్పి విమానం ఎక్కేశారు.

కనుక అప్పటి వరకు పిన్నెల్లి అజ్ఞాతవాసం కొనసాగించాలని వైసీపి మేధావులు సూచించి ఉండవచ్చు. ఒకవేళ 175/25 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాంటి కేసులైనా మాఫీ చేసుకోవచ్చని భావిస్తున్నట్లున్నారు.

జగన్‌ విదేశాలలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం ఏవిదంగా తెలుసుకోలేకపోయారో, అలాగే ఇప్పుడు తమ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంని ధ్వంసం చేసి, పరారయ్యారని, ఆయన కోసం ఏపీ పోలీసులు వెతుకుతున్నారనే విషయం కూడా బహుశః తెలిసి ఉండకపోవచ్చు… అని సర్ధి చెప్పుకోక తప్పదు.

కేంద్ర ఎన్నికల కమీషన్‌ గట్టిగా మొట్టి కాయలు వేసిన తర్వాత ఏపీ ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్‌ మీనాలో కూడా చలనం కలిగింది.

పోలింగ్‌కు ముందు తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లు, ‘పిన్నెల్లి ఈవీఎం’ ఎపిసోడ్‌లో మొదట చాలా మెతకగా వ్యవహరించిన ముఖేష్ కుమార్‌ మీనా, ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ తప్పదని, నేరం రుజువైతే కనీసం 7 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని, రెండేళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడితే అనర్హత వేటు పడుతుందంటూ చట్టాలను వివరిస్తున్నారు.

ఇవన్నీ చూసిన తర్వాత చివరిగా ఒక మాట చెప్పుకోక తప్పదు. ఈసారి ఎన్నికలలో వైసీపి గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని తెలిసినప్పుడైనా వారు హుందాగా వ్యవహరించి ఉండి ఉంటే, ప్రజలు కూడా వారి 5 ఏళ్ళ పాపాలను, వైఫల్యాలను, అరాచకాలను పెద్ద మనసుతో క్షమించి ఉండేవారేమో?

కానీ శిశుపాలుడు వంద తప్పులు చేసి కృష్ణుడు చేతిలో చనిపోయిన్నట్లు, వైసీపి నేతలు కూడా అధికారంలో నుంచి దిగిపోయే ముందు ఈ విదంగా అరాచకాలకు పాల్పడుతూ, ప్రజలందరూ కూడా అసహ్యించుకునేలా చేసుకున్నారు.

కానీ వారి మాటల్లో ఏ కోశాన్నా పశ్చాత్తాపం కనబడటం లేదు. కనుక ఫలితాలు వెలువడిన తర్వాత పర్యవసానాలు ఎదుర్కొంటూ ప్రతీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు. దానికి కూడా వైసీపిలో అందరూ ‘సిద్దం’గా ఉండక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories