తెలంగాణలో ఎన్నికలలో పోటీ చేయడం ఎంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందంటే, కేసీఆర్ ఒక్కో అభ్యర్ధికి పార్టీ తరపున రూ.40 లక్షలు చొప్పున చెక్కులు ఇచ్చారు. కేవలం వాటితోనే ఎన్నికల ప్రచారం చేశారనుకొన్నా 119 మంది అభ్యర్ధులకు కలిపి రూ.47.60 కోట్లు అయ్యింది. కానీ అంతకు 10-20 రెట్లు ఎన్నికలలో ఖర్చవుతుందని అందరికీ తెలిసిందే.
ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి నేటి వరకు ఈ పది రోజులలోనే హైదరాబాద్, బెంగళూరు నుంచి వందల కోట్లు నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరిగేలోగా ఇంకెన్ని వేలకోట్లు పట్టుబడతాయో తెలీదు.
ఈ డబ్బు కట్టలని బట్టి దేశంలోకే తెలంగాణ శాసనసభ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలని స్పష్టం అవుతోంది. అందుకే తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పనిచేసి, తెలంగాణ జనసమితి పార్టీతో కేసీఆర్‌ని ఎదుర్కోవాలనుకొన్న ప్రొఫెసర్ కోదండరామ్ ఈ ఎన్నికలలో పోటీ చేయలేనని చేతులెత్తేశారు.
ఆర్ధికంగా, రాజకీయంగా అత్యంత శక్తివంతుడుగా ఎదిగిన కేసీఆర్‌ని ఢీకొనాలంటే ఏ ఒక్కరి వల్లనో సాధ్యం కాదన్నారు. కానీ అభివృద్ధి మాటున భారీగా ఆస్తులు పోగేసుకొన్న కేసీఆర్‌ని ఇప్పుడు గద్దె దించకపోతే మరెన్నటికీ దించలేమని కోదండరామ్ చెప్పడం గమనిస్తే, డబ్బు, అధికారం, చేతిలో అధికార యంత్రాంగం ఉన్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూడా జయించగలరని అర్దమవుతోంది.
అయితే ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు. ఏపీ శాసనసభ ఎన్నికలను కూడా డబ్బు, అధికారమే శాసించబోతున్నాయి. అయితే కేసీఆర్‌లాగ జగన్ అభివృద్ది జోలికి పోలేదు. సంక్షేమ పధకాల పేరుతో రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లను ప్రలోభపరిచి వైసీపిని గెలిపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, లిక్కర్ వగైరాల మాఫియాలతో ఆర్ధికంగా చాలా బలపడ్డారని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సెల్ఫీ ఛాలెంజ్ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు తెలియజేశాయి.
తాజాగా ఒంగోలులో వైసీపి నేతలు నకిలీ డాక్యుమెంట్లతో భూదందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వయంగా బయటపెట్టారు కూడా. ఆర్ధికంగా బలపడిన వైసీపి నేతలందరూ వచ్చే ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చుపెట్టగలరు. కనుక ఏపీ శాసనసభ ఎన్నికలు కూడా చాలా ఖరీదైన వ్యవహారంగానే ఉండబోతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల ఖర్చులను నియంత్రించాలంటూ మాటలకే పరిమితమవుతుంటే, మరోవైపు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఎన్నికలను సాధారణ రాజకీయపార్టీలు సైతం పోటీ చేయలేనంత ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. తద్వారా అధికార పార్టీలు పోటీదారులను ముందే తప్పుకొనేలా చేస్తున్నాయి. ప్రొఫెసర్ కోదండరామ్ తప్పుకోవడమే ఇందుకు తాజా నిదర్శనం. రేపు ఏపీలోను ఇలాగే జరుగబోతోంది.




