ప్రాణాలకు తెగించి అడవులలో తుపాకులు పట్టుకొని తిరుగుతున్న కరడుగట్టిన మావోయిస్టులు ప్రాణ భయంతో జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే పారితోషికాలు తీసుకొని శేష జీవితం హాయిగా జీవించాలని అనుకుంటున్నారు.
అటువంటప్పుడు రాజకీయ ఎన్కౌంటర్ అవుతున్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతే మంచిదనిపిస్తుంది. లేకుంటే వచ్చే ఎన్నికలలో మరోసారి ఎన్కౌంటర్ అయితే భరించడం చాలా కష్టం. అప్పుడు వెనక నిలబడి తలూపేందుకు ఎవరూ మిగలకపోవచ్చు.
వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు వచ్చే ఎన్నికలలో కూడా రాజకీయ ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎలా అంటే… ముందుగా ఏపీలో స్టోరీ చెప్పుకుందాము.
కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు గొడవలు పడి విచ్చిన్నం అయిపోతాయనుకుంటే వాటి మద్య బంధం నానాటికీ బలపడుతోంది. పోనీ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు చెడుతాయనుకుంటే అవి కూడా నానాటికీ బలపడుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా సత్సంబంధాలు నెలకొన్నాయి.
ప్రతీ సార్వత్రిక ఎన్నికలో కాంగ్రెస్ (ఇండియా కూటమి) కొద్దికొద్దిగా బలపడుతూనే ఉంది. కనుక వచ్చే ఎన్నికల తర్వాత మరింత బలపడవచ్చు.
కాంగ్రెస్ మిత్ర పక్షాలు బలపడుతున్న కొద్దీ ఎన్డీయేలో చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంటుంది. ఆయనకు కాంగ్రెస్ మిత్ర పక్షాలతో కూడా మంచి స్నేహమే ఉంది. కనుక అవసరమైతే వాటిలో కొన్నిటినీ ఎన్డీయేవైపు తీసుకు రాగలరు. కనుక చంద్రబాబు-మోడీ బంధం మరింత బలపడుతుంది. అది వైసీపీకి అరిష్టమే!
వైసీపీ హయంలో ఏపీలో అభివృద్ధి బ్రేకులు వేసినట్లు నిలిచిపోగా ఇప్పుడది పరుగులు పెడుతోంది. చంద్రబాబు నాయుడు కృషి ఫలించి రాబోయే ఎన్నికలలోగా అమరావతి, పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేయగలిగినా, కనీసం రూపురేఖలు తేగలిగినా అవి పూర్తయ్యేందుకు ప్రజలు మళ్ళీ కూటమికే మొగ్గు చూపుతారు. చూపకపోతే ఏమవుతుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు కూడా.
అలాగే నారా లోకేష్ కృషి ఫలించి రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, ఐటి కంపెనీలు గ్రౌండింగ్ అయ్యి, ఉద్యోగాలు కల్పించి ఉత్పత్తి ప్రారంభిస్తే వాటిని చూసి ప్రజలు కూటమికే మళ్ళీ మొగ్గు చూపడం ఖాయం.
175కి 175 మనకే అనుకుంటే కేవలం 11 సీట్లు వచ్చాయి. ఈ దెబ్బతో శాసనసభకి, ప్రజల మధ్యకు కూడా రాలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అధ్యక్షుడు ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని చూస్తే అర్ధమవుతుంది.
కనుక కూటమికి అన్నీ శుభ శకునాలే కనిపిస్తుంటే వైసీపీకి ఇవన్నీ అపశాకునాలే అవుతాయి. కనుక వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీ రాజకీయ ఎన్కౌంటర్ అయ్యే అవకాశాలే ఎక్కువ.
కానీ ‘మళ్ళీ మనమే’ అంటూ డ్రీమ్ సాంగ్ పాడుకుంటూ పగటి కలలు కంటూ కేసులలో చిక్కుకోవడం కంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ఇప్పుడే జనజీవన స్రవంతిలో కలిసిపోతే మంచిదేమో?బీఆర్ఎస్ పార్టీ జనజీవన స్రవంతిలో కలిసిపోవడం ఎందుకో మరోసారి చెప్పుకుందాము.




