ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిమ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్, గచ్చిబౌలిలో బుధవారం రాత్రి అరెస్ట్ చేసి ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మెప్పు కోసం పోసాని, రాంగోపాల్ వర్మ, శ్రీరెడ్డి వంటి పలువురు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి చాలా నీచంగా, అవహేళనగా మాట్లాడుతుండేవారు.
మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని జగన్ పదేపదే భరోసా ఇస్తుండటంతో అది నమ్మి పోసాని వంటివారు రెచ్చిపోయేవారు.
కానీ ఎన్నికలలో అనూహ్యంగా జగన్ ఓడిపోయి అధికారం కోల్పోవడంతో ఆనాడు జగన్‌ని నమ్ముకుని చెలరేగిపోయిన వారందరూ వరుసగా కటకటాల పాలవుతున్నారు.
పోసానిపై ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్‌లో సెక్షన్స్ 196,353 (2), 111 రెడ్ విత్ 3(5)కింద కేసు నమోదు చేశారు. ఆయనతో సహా మిగిలినవారిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు తమపై పిటిషన్ వేసిన సత్యవర్ధన్ అనే దళిత వ్యక్తిని వంశీ కిడ్నాప్ చేసినందుకు వంశీని పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు చేశారు?అన్యాయం.. అక్రమం అంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెట్టేశారు.
టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వారిని జగన్ పరామర్శించడం అంటే అటువంటి నేరాలు చేసిన వారందరికీ తాను అండగా ఉంటానని చెప్పిన్నట్లే కదా?
కానీ అందరూ అనుకుంటున్నట్లు వంశీని కిడ్నాప్ కేసులో కాక ఆయన చాలా అందగాడు కనుకనే చంద్రబాబు నాయుడు ఓర్వలేక అసూయతో అరెస్ట్ చేయించారని, ఇంకా వైసీపీలో చాలా మంది అందగాళ్ళున్నారని వారి అరెస్టులు తప్పవని” జగన్ ఆరోజే చెప్పేశారు.
కనుక పోసానికి కూడా ఆయన అందమే శాపంగా మారిందని వైసీపీ నేతలు సరిపెట్టుకోవచ్చు. వంశీని అరెస్ట్ చేస్తేనే ఎందుకు చేశారో తెలీని అమాయకులు వైసీపీ నేతలు. కనుక పోసానిని అరెస్ట్ చేయగానే అలవాటు ప్రకారం అన్యాయం, అక్రమం అని గొంతు చించుకుంటున్నారు పాపం!
అధికారంలో ఉన్నప్పుడు చేయకూడని తప్పులు, నేరాలన్నీ చేసి, అధికారం కోల్పోగానే రాజకీయాల నుంచి, పదవుల నుంచి తప్పుకుంటే ఆ పాపాలన్నీ ఆటోమేటిక్‌గా రద్దు అయిపోయే ఫెసీలిటీ ఉంటే దానిని దేశ ప్రజలందరికీ వర్తింపజేస్తే ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లు అవసరమే ఉండదు కదా?




