jagan_ysrజగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది దేవుడికైనా తెలుసో లేదో గానీ, ప్రస్తుతం ఆ దేవుని చెంతకు చేరిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా సకల శాఖా మంత్రిగా పిలవబడే సజ్జల రామకృష్ణారెడ్డి నుండి ఓ ప్రకటన వెలువడింది.

వైఎస్సార్ రోజుల్లోకి తీసుకెళ్లడం అంటే… అదేదో టైం మెషిన్ లో కూర్చోపెట్టి వెనక్కి తీసుకెళ్లడం కాదండోయ్! 2004 నుండి అధికారం ఎక్కిన తర్వాత నుండి 2014 వరకు పరిపాలించిన కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కరెంట్ కోతలతో చుక్కలు చూపించారు. ప్రస్తుతం ఏపీ సర్కార్ ఈ దిశగానే అడుగులు వేస్తోంది.

ముందుగా 2004 నుండి మొదలుపెడితే… అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత విద్యుత్ ను అమలు చేస్తానని చెప్పిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇచ్చిన మాటకు అనుగుణంగా ఉచిత విద్యుత్ ను విజయవంతంగా అమలు చేయగలిగారు. ఉచిత విద్యుత్ ను అయితే అమలు చేసారు గానీ, రాష్ట్రానికి కావాల్సినంత విద్యుత్ ను అయితే సమకూర్చలేకపోయారు.

దీంతో మొదటి ఏడాది నుండే రాష్ట్ర ప్రజలకు కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. ఆ అయిదేళ్ల ప్రయాణంలో ఆరోగ్య శ్రీ వంటి ఇతర పధకాలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుని వెళ్లడంతో, కరెంట్ వ్యధలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ వైఎస్సార్ మరణం తర్వాత చిన్నాభిన్నం అయిన రాష్ట్రం, ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సంక్షోభంలో కూరుకునిపోయింది.

తదుపరి అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒరిగింది ఏమిటయ్యా అంటే… ఎన్నాళ్ళో కల అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ఏమీ లేదు. ఇక విభజనకు గురైన తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు మూడంటే మూడు నెలల్లో రాష్ట్రంలో కరెంట్ కోతలకు శుభంకార్డు వేసారు, అది కూడా రాష్ట్ర ప్రజలపై ఎటువంటి అదనపు భారం పడకుండా!

అలా 2014 నుండి 2019 వరకు కూడా నిర్విరామంగా విద్యుత్ సరఫరాను అందివ్వడంతో పాటు మిగులు విద్యుత్ తో దేశంలోనే తలమానికంగా నిలిచారు. దీంతో అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులు కూడా చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ వశం అయ్యాయి. 2019లో అధికార మార్పు ఇచ్చిన ప్రజలకు మరింతగా సేవలు చేయాల్సింది పోయి, విద్యుత్ భారాన్ని ప్రజల నెత్తి మీద పెట్టబోతోంది నేటి సర్కార్.

ఇప్పటికే విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అని దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇది చాలదన్నట్లుగా తాజాగా విద్యుత్ కోతలు కూడా తప్పవంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేసారు. చార్జీల మోతతో కనీసం రాబోయే సమ్మర్ కు విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉంటుందని భావించిన ప్రజలకు సజ్జల ప్రకటన షాకింగ్ లా మారింది.

అంతర్జాతీయంగా బొగ్గు కొరత ఏర్పడిందని, యూనిట్ కు 25 రూపాయలు ఖర్చు చేసినా విద్యుత్ లభించడం లేదని వాపోయిన సజ్జల, రానున్న రోజుల్లో కరెంట్ కోతలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి కూడా చేసారు. అయితే దీనిపై ప్రజల నుండి భారీ స్థాయిలో వ్యతిరేకత తధ్యం అన్న భావన ఏర్పడుతోంది.

మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన ఘనతను జగన్ మోహన్ రెడ్డి సర్కార్ సొంతం చేసుకోగా, వేసవి కాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువవుతుందన్న విషయాన్ని కూడా ప్రభుత్వం గమనించుకోలేదని ఈ సందర్భంగా స్పష్టమవుతోంది. అయినా ఇంత బొగ్గు కొరత ఉన్నపుడు, రాష్ట్రం సోలార్ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదు? కనీసం ఈ దిశగా ప్రజలకు అవగాహన అయినా కల్పించాలి కదా?!