త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుండి జాలువారిన అద్భుతమైన డైలాగ్ లలో ‘జులాయి’లో అల్లు అర్జున్ చేత చెప్పిన ‘బాబా – సైంటిస్ట్’ డైలాగ్ ఒకటి. “లాజిక్ లు ఎవరూ నమ్మరు సార్, అందరికీ మ్యాజిక్ లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్ట్ ల కన్నా బాబాలే ఫేమస్” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన లభించింది. ఈ డైలాగ్ ను ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే… గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఒక జ్యోతిష్కుడు చేసిన వ్యాఖ్యలు ఒక రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి.
“మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందని, మరికొన్ని గంటల్లో ప్రపంచ వినాశనం మొదలు కానుందని, మే 13వ తేదీ నుంచి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కానుందని” ప్రముఖ జ్యోతిష్కుడు ప్రమోద్ గౌతమ్ ప్రకటించారు. అమెరికాను కాపాడుకునే ప్రయత్నంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రమైన చర్యలకు దిగుతారని, ఈ క్రమంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రపంచం మొత్తం కకావికలమవుతుందని అన్నారు. అయితే ఇలాంటివి సహజంగా ఎప్పుడూ హల్చల్ చేసేవే అయినప్పటికీ, ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడానికి ఓ కారణం ఉంది.
గత అమెరికా ఎన్నికల్లో అందరూ హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెప్పిన తరుణంలో… కాదు కాదు… డోనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేస్తారని చెప్పి, ఒక్కసారి ఫేమస్ అయ్యారు గౌతమ్. ట్రంప్ విజయం ప్రస్తుత వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చినట్లయ్యింది. దీంతో గ్లోబల్ మీడియా కూడా దీనిని హైలైట్ చేస్తోంది. ఇంతకు ముందు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్కుడు కూడా జూన్ 14వ తేదీ నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఇలా చెప్పడంతోనే ఆపకుండా, మరోవైపు తన శిష్యులతో కలసి ఆగ్రాలోని యమునా తీరంలో ప్రమోద్ గౌతమ్ మహా శాంతి హోమాన్ని నిర్వహించారు. ఈ హోమం ద్వారా యమున సోదరుడు, మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజును ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశామని… తద్వారా యుద్దాన్ని నివారించేందుకు తమ వంతు ప్రయత్నం చేశామని చెప్పారు. దీంతో ప్రపంచ యుద్ధాన్ని తిలకించడానికి సిద్ధంగా ఉన్నారా..? అంటూ నెటిజన్లు సదరు అంశాన్ని ప్రస్తావిస్తూ వేస్తున్న కౌంటర్లకు కొదవలేదు.



