టిడిపి, జనసేనలకు ప్రశాంత్ కిషోర్‌ అవసరమా?

Prashant-Kishor-Pawan-Kalyan-Chandrababu-Naidu

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ భేటీ అవడంపై వైసీపి నేతలు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. అది వారి అసూయ, లేకితనాన్ని, అభద్రతాభావాన్ని సూచిస్తోంది. దీనిపై చర్చ ఇప్పుడు అనవసరం.

ఇప్పటికే ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. ఆ ఎన్నికలను వ్యాపారంగా మార్చేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్‌. ఆయనకు ఈ పార్టీ… ఆ పార్టీ తేడా లేదు. రాజకీయపార్టీల సిద్దాంతాలతో కూడా ఆయనకు పట్టింపు లేదు. పూర్తి భిన్నమైన సిద్దాంతాలు కలిగిన బీజేపీకీ ఆయన పనిచేశారు. కాంగ్రెస్‌కీ పనిచేశారు.

ADVERTISEMENT

గత ఎన్నికలలో వైసీపి కోసం పనిచేసినప్పుడు టిడిపిని దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదులుకోలేదు. ముఖ్యంగా నారా లోకేష్‌ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేసిన ప్రచారం గురించి అందరికీ తెలిసిందే. అదే వ్యక్తిని ఇప్పుడు టిడిపి సాయం కోరితే ప్రజలు ఏమనుకొంటారో కానీ ముందు వైసీపి చేస్తున్న విమర్శలకు టిడిపి, ప్రజలకు ఆ పార్టీ నేతలు జవాబు చెప్పుకోలేని దుస్థితి ఏర్పడుతుంది.

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ కలిసినా కూడా జగన్మోహన్‌ రెడ్డిని ఎదుర్కొలేకనే ప్రశాంత్ కిషోర్‌ని కూడా తెచ్చుకొంటున్నారంటూ వైసీపి నేతలు అప్పుడే విమర్శిస్తున్నారు. వైసీపి విమర్శలను పక్కన పెట్టి చూసినా, రాజకీయ, నైతిక విలువలు పాటించని ప్రశాంత్ కిషోర్‌ని తెచ్చుకొని, ఆయన సలహాలతో సీట్ల సర్దుబాట్లకు పూనుకొంటే టిడిపిలో అంతర్గతంగా, టిడిపి, జనసేనల మద్య కూడా ముసలం పుట్టవచ్చు.

ప్రశాంత్ కిషోర్‌ గత ఎన్నికలలో వైసీపికి పనిచేసినందున ఆయన ఆ పార్టీ బలాలు, బలహీనతలు, రహస్యాలను ఇప్పుడు టిడిపికి అందించి ఎన్నికలలో గెలిచేందుకు తోడ్పడవచ్చు. కానీ మళ్ళీ భవిష్యత్‌లో వైసీపి కోసం పనిచేస్తే అప్పుడూ టిడిపి గురించి వైసీపికి చెప్పకుండా ఉంటారా?అంటే కాదనే అర్దమవుతోంది. ఈ కారణంగానే ఆనాడు కేసీఆర్‌ ప్రశాంత్ కిషోర్‌ని దూరం పెట్టారు కూడా. కనుక టిడిపి, జనసేనలు ప్రశాంత్ కిషోర్‌ని దూరంగా ఉంచడమే మంచిది.

కర్ణాటక, తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సొంత బలం, సొంత ప్రణాళికలు, వ్యూహాలతోనే విజయం సాధించి అధికారంలోకి రాగలిగింది. అదేవిదంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్ ఎన్నికలలో బీజేపీ కూడా అధికారంలోకి వచ్చింది. ఏపీలో టిడిపి, జనసేనలు కలిస్తే గెలుపు ఖాయమని ఇప్పటికే సర్వేలు సూచిస్తున్నప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్‌ సాయం కోరడం ఎందుకు?అవసరమా?

ADVERTISEMENT
Latest Stories