ప్రశాంత్ కిశోరే నిజం కక్కేసాడు, ఇక జనం వంతే!

prashant-kishor

ఏపీలో కేవలం సంక్షేమ పధకాలు మాత్రమే కనిపిస్తాయి. వినిపిస్తాయి. కానీ తెలంగాణలో సంక్షేమ పధకాలతో పాటు అభివృద్ధి కూడా కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తుంది. సంక్షేమ పధకాలతోనే ఏపీలో 98 శాతం పేదల జీవితాలను మార్చేశామని జగన్, మంత్రులు గొప్పగా, గర్వంగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వమూ చేయలేని పని వైసీపి ప్రభుత్వం కేవలం నాలుగున్నరేళ్ళలో చేసేయడం నిజమైతే, నిజంగా అభినందించాల్సిందే! ఇదే సంక్షేమ విధానాన్ని యావత్ దేశం, యావన్ ప్రపంచంలో అమలుచేస్తే సరిపోతుంది కదా?

ADVERTISEMENT

ఒకవేళ సంక్షేమ పధకాలతోనే ఆంద్రాలో పేదల జీవితాలలో మార్పు వచ్చేసి, పేదరికం తొలిగిపోయి ఉంటే ఇకపై వాటిని కొనసాగించనవసరం లేదు కదా?కానీ వైసీపినే మళ్ళీ గెలిపిస్తే భవిష్యత్‌లో కూడా మరిన్ని సంక్షేమ పధకాలను కొనసాగిస్తామని జగన్, మంత్రులు స్వయంగా చెప్పుకొంటున్నారు. అంటే వాటితో పేదల జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదనే కదా అర్ధం?

వైసీపి ఓటు బ్యాంక్‌ని పెంచుకొనేందుకు జగన్‌ ప్రభుత్వం ఎంచుకొన్న ఈ సంక్షేమ విధానం తప్పని, దీని కోసం చేస్తున్న అప్పుల వలన రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలకు కూడా నష్టమే తప్ప లాభం లేదని స్పష్టమవుతోంది.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ కూడా తన బిఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ పెంచుకొనేందుకు అనేక సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నారు. అయితే కేవలం వాటికే ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయలేదు.

ఏపీ ప్రభుత్వం సంక్షేమ పధకాల కోసమే లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కోసమే అప్పులు చేస్తోంది. దాంతో అన్ని రంగాలను అభివృద్ధి చేసుకొంటూ వాటి ద్వారా సంపద సృష్టించుకొని ఆ ఆదాయాన్ని సంక్షేమ పధకాలకు వినియోగిస్తోంది. అంటే చంద్రబాబు నాయుడు చెపుతున్నట్లు కేసీఆర్‌ కూడా సంపద సృష్టించి దానినే పేదలకు పంచిపెడుతున్నారన్న మాట.

జగన్‌ ప్రభుత్వానికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్, ఇటీవల విలేఖరులతో ముఖాముఖీ నిర్వహించినప్పుడు, దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధిని పట్టించుకోకుండా, కేవలం సంక్షేమ పధకాలను మాత్రమే అమలుచేస్తుంటే చివరికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలాగ దివాళా తీస్తాయని కుండ బద్దలు కొట్టారు. కనుక సంపద సృష్టించుకొని, దాని నుంచి ఖర్చు చేసుకోవాలి తప్ప అప్పులు చేసి సంక్షేమ పధకాలను అమలుచేస్తే చివరికి అడ్డుకొనే దుస్థితి తప్పదని హెచ్చరించారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి గుణపాఠం నేర్చుకోవాలన్నారు.

వచ్చే ఎన్నికలలో వైసీపిని గెలిపించే బాధ్యత తీసుకొన్న ప్రశాంత్ కిషోర్ స్వయంగా వైసీపి విధానం తప్పని చెపుతున్నారు. దాని వలన ఏపీ పరిస్థితి తారుమారు అయ్యిందని చెపుతున్నారు. కనుక ప్రజలే ఆలోచించుకొని రాష్ట్రాభివృద్ధి చేయగల పార్టీని ఎన్నుకోవలసి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories