రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లు రావణ్‌తో కాలక్షేపం అవసరమా?

Prashna Ravan controversy

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ఏదో ఒక సమస్యని ఇవ్వడం దాంతో కూటమి ప్రభుత్వం పట్లు పడుతుండటం పరిపాటిగా మారింది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ విషయంలో అధికార ప్రతిపక్షాల వాదోపవాదాలు చూస్తూనే రాష్ట్రంలో మరే సమస్యలు లేవా? అని అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, రైతుల కొరకు సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ రహదారులు, పట్టణ మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి… ఇలా ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అనేక అంశాలు రోజురోజుకూ పేరుకుపోతున్నాయి.

ADVERTISEMENT

ఉదాహరణకు విశాఖ ఉక్కు భవిష్యత్ గురించి దానిలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులు, ఉన్నతోద్యోగులు తీవ్ర ఆందోళనతో జీవిస్తున్నారు. వారి సమస్య కంటే ప్రశ్న రావణ్ అంశం ముఖ్యమైనదా తీవ్రమైనదా?

నేటికీ రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు సరైన రోడ్లు, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారు. వారి సమస్యల కంటే ‘రావణ్’ ముఖ్యమా?

ఇదివరకు హటాత్తుగా కరోనా మహమ్మారి మీద పడినప్పుడు దేశం అల్లకల్లోలం అయింది. తర్వాత తేరుకొని చురుకుగా నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో ఆ గండం నుంచి తప్పించుకోగలిగాము. ఇప్పుడు అదేవిధంగా ‘ఎల్‌నినో’ ప్రభావంతో అకాల వర్షాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ పదేపదే హెచ్చరిస్తున్నా అధికార ప్రతిపక్షాలు దాని గురించి చర్చించకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పనికిరాని అంశాలతో ఎందుకు కాలక్షేపం చేస్తున్నాయి?

కూటమి ప్రభుత్వం పాలన లోపభూయిష్టంగా, అవినీతిమయంగా సాగుతోందని వాదిస్తున్నప్పుడు ఆ పార్టీ అధినేత జగన్‌ ప్రజల మధ్యకు, శాసనసభకు వచ్చి గట్టిగా నిలదీయవచ్చు కదా? కానీ ఆయన కూడా ఒకసారి ‘రావణ్’తో మరోసారి మరొకరి పేరుతో రాజకీయ కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకు?

ఇన్ని ప్రజా సమస్యలున్నప్పుడు వాటి గురించి అధికార, ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రజలు కూడా సంతోషిస్తారు. ఆమోదిస్తారు. కానీ తమ రాజకీయ కాలాక్షేపాన్ని ప్రజలు అర్థం చేసుకోలేరనుకోకూడదు. అనుకుంటే వారికే ప్రమాదం.

ADVERTISEMENT
Latest Stories