ఏపీ రాజధాని అమరావతి గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవాల్సి వస్తే ముందుగా సిఎం చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలి. కానీ ప్రతీసారి ముందుగా మాజీ సిఎం జగన్ గురించి రాజధాని పట్ల ఆయన వైఖరి గురించి చెప్పుకోవాల్సి రావడం దౌర్భాగ్యమే.
జగన్ హయంలో అమరావతి పరిస్థితి గురించి అందరికీ తెలుసు. తాజా వైఖరి గురించి కూడా అందరికీ తెలుసు. ఆ స్టోరీల గురించి చెప్పుకుంటే అసలు విషయం పక్కకు పోతుంది.
వచ్చే ఎన్నికల నాటికి రాజధాని అమరావతిలో ముఖ్యమైన భవన సముదాయాలు, మౌలికవసతులు అన్ని పనులు పూర్తి చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు గడువు విధించారు. కనుక ఈసారి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు ఉపయోగిస్తూ చకచకా నిర్మాణ పనులు పూర్తిచేస్తున్నారు.
సచివాలయ టవర్ల నిర్మాణంలో హైడ్రాలిక్ లిఫ్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో నెలకు రెండు మూడు అంతస్తుల నిర్మాణం పూర్తి చేస్తున్నారు.
ఈసారి అన్ని భవనాల స్ట్రక్చర్స్ ముందుగా నిర్మిస్తున్నారు. అప్పుడు వర్షాకాలంలో సమయం వృధా కాకుండా అంతర్గత నిర్మాణపనులు చేసుకోవచ్చని ఈవిధంగా చేస్తున్నారు. ఈ లెక్కన గడువు కంటే ముందే ప్రధాన కట్టడాల నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
అంతర్గత సివిల్ పనులు కూడా పూర్తయితే తర్వాత ఇంటీరియర్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి పనులు ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని పనులు సకాలంలో పూర్తయితే ఎన్నికలకు ముందే కొత్త సచివాలయం టవర్లలోకి ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తారు లేకుంటే ఎన్నికల తర్వాత ప్రభుత్వం కొలువు తీరగానే తరలించాలని ప్లాన్ చేసుకుంటోంది కూటమి ప్రభుత్వం.
కొత్త సచివాలయ టవర్లు, శాసనసభ భవన సముదాయం, హైకోర్టు భవన సముదాయంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, సిబ్బంది నివసించేందుకు నివాస సముదాయాల నిర్మాణ పనులు కూడా చురుకుగా, సమాంతరంగా సాగుతున్నాయి.
వీటన్నిటితో పాటు రాజధానికి అత్యంత కీలకమైన 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణం కూడా సమాంతరంగా కొనసాగుతోంది. ఇవన్నీ పూర్తయితే అమరావతిని కాదని మావిగన్ అని ఎన్నికలలో ఎవరైనా అనగలరా?
రాజధానికి వరద నియంత్రణతో పాటు అమరావతితో సహా చుట్టుపక్కల గ్రామాలకు 365 రోజులు నిరంతరం తాగుసాగు నీటిని అందించేందుకు కొండవీటి వాగు, పాలవాగు రిజర్వాయర్ల నిర్మాణ పనులలో ఇంకా వేగం పెంచాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారు. ఈ మూడు కూడా నిర్ణీత గడువులో పూర్తయితే రాజధాని నిర్మాణం పరిపూర్ణంగా ఉంటుంది. .
అమరావతి పూర్తిగా ప్రీ-ప్లాన్‌డ్ సిటీ, అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నందున భవిష్యత్‌లో మళ్ళీ కూల్చివేతలు, మార్పులు చేర్పులు అవసరం ఉండకపోవచ్చు.
కనుక అత్యద్భుతంగా తీర్చిదిద్దబడిన దుబాయ్‌లో ఏవిధంగా దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు సంస్థలు స్థిరపడాలని కోరుకుంటున్నారో అదే విధంగా అమరావతిలో తమకి ఒక అడ్రస్ ఉండాలని రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చేవారు, ప్రముఖులు, సంస్థలు కోరుకుంటారు.
వేల ఎకరాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి పరిపాలనా నగరాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో రూపొందిన ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నగర నిర్మాణ కార్యక్రమాల్లో ఒకటిగా నిలువబోతోంది.
కనుక అమరావతి అంటే కేవలం రాష్ట్ర రాజధాని కొన్ని బహుళ అంతస్తుల భవనాలు మాత్రమే కాదు. రాష్ట్ర గౌరవానికి, ప్రతిష్టకి, ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలకి ప్రతిరూపం.




