ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదం ఇటు ఏపీలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల చిత్తశుద్ధిని సవాల్ చేస్తే తెలంగాణలో అధికార పార్టీ నేతలైన కాంగ్రెస్ నాయకుల సంకుచిత బుద్దిని బయటకు తెచ్చింది.
రాజకీయ విశ్లేషకుడు కాబట్టి తన ఊహాగానాలను రాజకీయ విశ్లేషణాలుగా ప్రచారం చేసే భావ ప్రకటన స్వేచ్ఛ నాగేశ్వరరావు కి ఉంది అంటూ వాదిస్తున్న నాగేశ్వరరావు అండ్ టీం కి తన పై చేసిన నిరాధారమైన రాజకీయ ఆరోపణల పై వివరణ అడిగే రాజకీయ స్వేచ్ఛ, ఎదురు ప్రశ్నించే హక్కు పవన్ కు ఉండదా.? అంటూ జనసేన నేతల నుంచి ఎదురుదాడి ఎదురయ్యింది.
అలాగే ఈ వివాదం పై కాస్త అతిగా స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సామెల్ పై చర్యలు తీసుకోవాలంటూ, ఏపీ ముఖ్యమంత్రి బాబు, ఉపముఖ్యమంత్రి పవన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన పై సుమోటోగా కేసు నమోదు చెయ్యాలంటూ ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ డీజీపీ ని డిమాండ్ చేసారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మధ్య జగన్ అరెస్టు గురించి చర్చ జరిగిందంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో పెద్ద రాజకీయ దుమారాన్నే సృష్టించాయి. అయితే నిరాధారమైన ఆరోపణలు వెనక్కి తీసుకోండి అంటూ జనసేన డిమాండ్ చేస్తే, తన మాటలను వెనక్కి తీసుకుంటున్నా అంటూ నాగేశ్వరరావు ఈ వివాదాన్ని ముగిసిన అధ్యాయంగా ప్రకటించారు.
అయితే నాగేశ్వరరావు చేసిన ఈ ప్రకటనలు కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవ్వడం తో ఈ వివాదంలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రవేశించారు. తెలంగాణ రాజకీయ మేధావి ని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులా.? ఇంకెన్నాళ్లు తెలంగాణ పై ఏపీ నాయకుల పెత్తనం.?
అసలు ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గా ఉన్న బాబు, పవన్ లకు సిగ్గుశారం ఉంటే హైద్రాబాద్ విడిచిపోవాలి, బతకడానికి వచ్చిన వాళ్లు మా పైన పెత్తనం చెయ్యడానికి వీలు లేదు, మీ రాజధాని అమరావతికి పోయి ఏడవండి, తెలంగాణ మీ ఇద్దరి జాగీరు కాదు అంటూ పరిధి దాటి రెచ్చిపోయారు.
దీనితో నాగేశ్వరరావు మాటల వివాదం రాజకీయ రంగు నుంచి ప్రాంతీయ రంగు పులుముకున్నట్టయ్యింది. అలాగే నాగేశ్వరరావు జనసేన గా మొదలైన వివాదం కాస్త కూటమి కాంగ్రెస్ గా మారింది. అయితే మందుల సామెల్ చేసిన ఈ వ్యాఖ్యల పై తాజగా స్పందించిన బీజేపీ నేత విష్ణువర్ధన్ తెలంగాణలో ఉండాలంటే ప్రత్యేకమైన పాస్ పోర్ట్, వీసా తీసుకోవాలా అంటూ ముఖ్యంమత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి ప్రశ్నించారు.
పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకే తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి ఇటువంటి బహిరంగ బెదిరింపులు వస్తే ఇక తెలంగాణలో సామాన్యుల పరిస్థితేమిటి.? ఎమ్మెల్యే సామెల్ చేసిన ఈ అసంబద్ద వ్యాఖ్యలు ఐదు కోట్ల ఆంధ్రులను అవమానించినట్లే అంటూ విష్ణువర్ధన్, సామెల్ వ్యాఖ్యల పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసారు.
అయితే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గా ఉన్న నేతలే ఇలా రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొట్టేలా మాట్లాడడం ఇంకెంతకాలం.? నాడు బిఆర్ఎస్ వేసిన ప్రాంతీయవాద రాజకీయ బాటనే కాంగ్రెస్ నేతలు కూడా అనుసరిస్తే ఎలా.? ఇటువంటి రాజకీయమే బిఆర్ఎస్ కొంప ముంచింది, కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసిందని కాంగ్రెస్ నేతలు గ్రహించలేకపోతున్నారా.?
వ్యక్తుల మధ్య ఎదురవుతున్న రాజకీయ విభేదాలను ప్రాంతాల మధ్య విద్వేషాలుగా చిత్రీకరించడమే తెలంగాణ రాజకీయ నాయకుల విధానమా.? ఒకపక్క రేవంత్ రెడ్డి తన రాజకీయ విధానాలతో టీడీపీ క్యాడర్ ని కాంగ్రెస్ కి దగ్గర చేస్తుంటే కాంగ్రెస్ నాయకుల అనాలోచిత ఆవేశం కాంగ్రెస్ కు అనవసర రాజకీయ శత్రువులను సృష్టిస్తుందని గ్రహించాలి.




