డ్రగ్స్ కేసులో విచారణ పూర్తి చేసుకున్న పూరీ జగన్నాధ్, తన తాజా చిత్రం “పైసా వసూల్”ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తోంది. దసరా బరిలో ఖచ్చితంగా ఉంటారని భావిస్తున్న ఈ సినిమాను వీలైతే ఇంకా ముందే రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. మరో మూడు రోజుల్లో “పైసా వసూల్”కు సంబంధించి తొలి టీజర్ రాబోతున్న నేపధ్యంలో… బాలయ్య – పూరీ కాంబో ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ లుక్స్ తో కూడిన ఓ మూడు స్టిల్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫుల్ గడ్డం, గాగుల్స్ తో స్టైలిష్ గా కనపడుతున్న బాలయ్య లుక్ ను చూస్తుంటే, ఖచ్చితంగా “పైసా వసూల్”తో పూరీ మరో భారీ ట్విస్ట్ ఇచ్చేలా కనపడుతున్నారనేది ఇండస్ట్రీ టాక్. ‘పోకిరి’ సినిమాలో కూడా ముందు మహేష్ ను ఇలాంటి ఫోజులతోనే చూపించి, చివరికి పోలీస్ ఆఫీసర్ ను చేసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాడు పూరీ.
బహుశా “పైసా వసూల్” ద్వారా అదే ఫీట్ ను రిపీట్ చేయాలని భావిస్తున్నారో ఏమో గానీ, ఈ సినిమాలో బాలయ్య చాలా స్టైల్ గా ఉండడంతో పాటు యువ హీరోలకు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో దర్శనమిస్తుండడంతో నందమూరి అభిమానగణం అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే జరిగితే గనుక… మళ్ళీ ఇండస్ట్రీలో పూరీ పేరు మారుమ్రోగడం ఖాయం… అలాగే డ్రగ్స్ ఆరోపణలకు ప్రాధాన్యత లభించకపోవచ్చు. దీంతో ‘పైసా వసూల్’ పూరీ జీవితానికి చాలా కీలకంగా మారిందని చెప్పడంలో సందేహం లేదు.


