సుమారు 130 కోట్ల జనాభా కలిగిన భారతావనిలో రియో ఒలింపిక్స్ లో గెలుచుకున్నది కేవలం రెండంటే రెండే పతకాలు. ఇందు కోసం భారత ప్రభుత్వం చేసిన ఖర్చు 810 కోట్ల రూపాయలంటే ఆశ్చర్యం కలగక మానదు. నాలుగేళ్ల కాలంలో క్రీడల కోసం అంటే శిక్షణా సెంటర్లు, కోచ్ లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం 750 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు చేయగా, నేషనల్ స్పోర్ట్స్ డెవలెప్ మెంట్ ఫండ్ ద్వారా 22.7 కోట్ల రూపాయలు, టార్గెట్ ఒలింపిక్ పోడియం ద్వారా 38 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో మొత్తం క్రీడల కోసం నాలుగేళ్ల కాలంలో భారత ప్రభుత్వం 810.7 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేస్తే భారత్ కు వచ్చిన పతకాలు కేవలం రెండంటే రెండే.
ఇదే సమయంలో ఒలింపిక్స్ లో పతకాల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న బ్రిటన్ 3,082 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేసినందుకు గాను ఆ దేశ క్రీడాకారులు మొత్తం 67 పతకాలు సాధించారు. అంటే సగటున ఒక్కో పతకం కోసం 41 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదే సమయంలో భారత్ మాత్రం ఒక పతకం కోసం 405 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇన్ని పతకాలు తెచ్చినా బ్రిటన్ వాసులు ఏ మాత్రం సంతోషం వ్యక్తపరచడం లేదు. అలాగని వచ్చిన రెండు పతకాలను తక్కువ చేసి చూడడం కాదు గానీ, విజయపు విహారంలో ఉన్న ప్రజల సంతోషాలను దూరం చేయాలని కాదు గానీ, అసలు వాస్తవం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది కదా!



