‘ఫిష్ ఆంధ్రా’ను ఏపీ సీఎం ఎంత గర్వంగా ప్రారంభించారో తెలిసిందే. బహుశా చంద్రబాబు నాయుడు అమరావతి శంకుస్థాపన చేసిన సందర్భంలో గానీ, పోలవరం నిర్మాణాలు జరుగుతున్న సమయంలో గానీ, అంత సగర్వంగా మాట్లాడలేదేమో!
ఏది ఏమైనా ‘ఫిష్ ఆంధ్రా’ రూపంలో ఓ కొత్త పధకాన్ని ప్రవేశపెట్టిన ఏపీ సీఎంను తాజాగా అదే పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు ఓ ప్రశ్న వేశారు. ఫిష్ ఆంధ్రాలోని ధరల పట్టికలో ఉన్న బోర్డు ఫోటోలో కొర్రమీను ధరను హైలైట్ చేస్తూ సీఎంకు ఓ ప్రశ్న సంధించారు.
అన్ని సినిమాల టికెట్ రేట్ ఒకటే అయినపుడు అన్ని చేపల రేటు ఒకటే ఎందుకు కాదు. పేదవాడికి కొర్రమీను తినే హక్కు లేదా? 600 ధర పెడితే పేదవాడు ఎలా తింటాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
సహజంగానే ఇలాంటి ఎటకారపు ట్వీట్స్ కు సోషల్ మీడియాలో భారీ స్పందన ఉంటుంది. అలాగే రాజు గారి లేటెస్ట్ ట్వీట్ కు నెటిజన్లు మరిన్ని అంశాలు జోడించి రిప్లైలతో సందడి చేస్తున్నారు. అతి త్వరలో ఎంతగానో ప్రేమించే వైసీపీని వీడతారని పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో, ఆర్ఆర్ఆర్ వేసే ప్రతి అడుగు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను దక్కించుకుంది.



