శత్రుశేషం ఋణశేషం ఉండకూడదంటారు పెద్దలు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడటంతో బిజెపికి, మోడీ- అమిత్ షాలకు తిరుగే లేకుండాపోయింది. అయినప్పటికీ పెద్దలమాట ప్రకారం కేరళలోని వాయ్‌నాడ్ నుంచి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి శత్రుశేషం లేకుండా చేసుకొన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ, “దొంగల పేర్లన్నీ ‘మోడీ’తోనే ఉంటాయెందుకు? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆయన ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశ్యించే ఆ మాట అన్నారని అర్దమవుతూనే ఉంది. కానీ బిజెపి ఏమీ తొందరపడలేదు. దాదాపు నాలుగేళ్ళు దీనిపై కోర్టు కేసులతో గడిపేసి, రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తున్నట్లు సూరత్ కోర్టు తీర్పు చెప్పగానే శుక్రవారం అనర్హత ఆయనపై అనర్హత వేటు వేసింది.
ఈరోజు ఉదయం రాహుల్ గాంధీకి లోక్‌సభకు హాజరైనప్పుడు లోక్‌సభ సెక్రెటరీ జనరల్ ఉత్తమ్ కుమార్ సింగ్ ఆయనను అనర్హుడుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, ఆ కాపీని ఆయన చేతికి అందజేశారు.
రాజ్యాంగంలోని సెక్షన్ 102 (1) (ఈ) ప్రకారం కనీసం రెండేళ్ళు జైలుశిక్ష పడిన సభ్యులు పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులవుతారు కనుక నేటి నుంచి రాహుల్ గాంధీ లోక్‌సభ సమావేశాలలో పాల్గొనేందుకు అనర్హులని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అనర్హత వేటు పడినందున వచ్చే లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ పోటీచేయలేకపోవచ్చు.
సోనియా గాంధీ ఇప్పటికే కాంగ్రెస్ నుంచి, రాజకీయాల నుంచి కూడా తప్పుకొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితి. సోనియా, రాహుల్ లేని కాంగ్రెస్ పార్టీని ఊహించుకోవడం కష్టమే. అటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి దేశంలో ఏ పార్టీ ముందుకు రాకపోవచ్చు. వచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చు.
కనుక దీంతో దేశంలో బిజెపికి మరో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడకుండా అడ్డుకొన్నట్లు కూడా భావించవచ్చు. కానీ దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి ఆయనపై పడ్డ అనర్హతని తొలగించుకొని, సభ్యత్వం పునరుద్దరించుకొనే అవకాశం ఉంది. ఇటీవలే రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “నేను దురదృష్టవశాత్తు ఎంపీ అయ్యాను” అంటూ నోరు జారారు. మోడీ ప్రభుత్వం ఆయన మాటలను నిజం చేసి బయటకు సాగనంపింది ఇప్పుడు.



